గురుకులాలు, మోడల్‌ స్కూళ్ళు నెంబర్‌వన్‌ స్థానంలో నిలవాలి

– 100శాతం ఉత్తీర్ణత సాధించేలా విద్యాబోధన సాగాలి
– రెండేళ్లలో 544 గురుకులాలు ప్రారంభించాం
– వీటికోసం 11వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం
– 194మోడల్‌ స్కూళ్లలోని విద్యార్థులకు రూ. 218కోట్లు ఖర్చుచేస్తున్నాం
– కేంద్రం పథకాలను ఎత్తివేసి.. ఉన్నవాటికి నిధులు తగ్గిస్తోంది
– విద్యార్థుల మేలుకోసం రాష్ట్ర ప్రభుత్వమే వాటిని భరిస్తుంది
– విద్యార్థులను ఇతర రంగాల్లోనూ ప్రోత్సహించాలి
– విద్యార్థులను సొంత బిడ్డల్లా భావించి.. ఉన్నతులుగా తీర్చిదిద్దాలి
– డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి
హైదరాబాద్‌, నవంబర్‌30(జ‌నంసాక్షి) : తెలంగాణాలోని గురుకులాలు, మోడల్‌ స్కూళ్లు అన్ని విభాగాల్లో  నెంబర్‌వన్‌ స్థానంలో ఉండాలని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అధికారులకు సూచించారు.  తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయాల ప్రిన్సిపాళ్లు, మోడల్‌ స్కూళ్ల ప్రిన్సిపాళ్ల వార్షిక సమావేశాన్ని కడియం గురువారం ప్రారంభించారు. రాష్ట్ర విద్యా శాఖ గురుకుల విద్యాలయాలు , మోడల్‌ స్కూళ్ళు రాష్ట్రంలో నెంబర్‌ వన్‌ స్థానంలో ఫలితాలు సాధించాలని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. 10/10 జీపిఏ, 100 శాతం ఉత్తీర్ణత రావాలన్నారు. రాష్ట్రంలో 194మోడల్‌ స్కూళ్ల లో 1,25,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీటికోసం 218 కోట్ల రూపాయలు ఏటా ఖర్చు చేస్తున్నాం. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక మోడల్‌ స్కూళ్లను ఎత్తివేసిందని, అయితే ఇక్కడ పేద పిల్లలు చదువుతున్నారనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.218 కోట్లను ఖర్చు చేస్తూ వీటిని కొనసాగిస్తోందని మంత్రి తెలిపారు. ప్రధాన మంత్రి మోడీ బేటీ బచావో, బేటీ పడావో అనే నినాదం ఇచ్చారు కానీ విద్యా రంగంలో ఒక్క కొత్త స్కీం కూడా తీసుకురాలేదన్నారు. పైగా ఉన్న స్కీం లను ఎత్తివేస్తూ, నిధులు తగ్గిస్తున్నారని ఆరోపించారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడున్న 90 శాతం బడుగు, బలహీన, మైనారిటీ వర్గాలకు నాణ్యమైన విద్య అందించాలని ఈ రెండేళ్లలో సీఎం కేసీఆర్‌ కొత్తగా 544 గురుకులాలు ప్రారంభించారని, వీటికి ఒక్కో గురుకులానికి 23 కోట్ల రూపాయల చొప్పున 11వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు.
విద్యాశాఖ 37 గురుకులాల్లో 18వేల మంది విద్యార్థులు చదువుతుండగా.. 245 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు. ఈ ఏడాది 6 గురుకుల విద్యాలయాలు జూనియర్‌ కాలేజీలుగా అప్‌ గ్రేడ్‌ చేశాంమని,  వచ్చే ఏడాది మిగిలిన 29గురుకుల విద్యాలయాలను, వచ్చే ఏడాది జూనియర్‌ కాలేజీలుగా అప్‌ గ్రేడ్‌ చేస్తున్నామన్నారు. 31 జిల్లాలకు జిల్లాకు ఒక బాలికల, ఒక బాలుర గురుకులాన్ని మంజూరు చేయాలని సీఎం కేసీఆర్‌ ను కోరితే ఆయన మంజూరు చేశారని కడియం తెలిపారు. వచ్చే ఏడాది జిల్లాకు రెండు చొప్పున గురుకులాలు ఉంటాయి. ప్రస్తుతం ఉన్న గురుకులాలు కాకుండా..కొత్తగా 35 సాధారణ గురుకులాలు వస్తాయని మంత్రి తెలిపారు. త్వరలోనే మోడల్‌ స్కూళ్ల ఉపాధ్యాయుల సర్వీస్‌ రూల్స్‌ సమస్య పరిష్కారం అవుతుందని, ఇప్పటికే సీపీఎస్‌ పరిధిలోకి వచ్చారన్నారు. విద్యా శాఖ గురుకులాలు, మోడల్‌ స్కూళ్ళు హరిత వనాలుగా ఉండాలని,  ఉత్తమ హరిత పాఠశాలకు వచ్చే ఏడాది నుంచి బెస్ట్‌ హరిత స్కూల్‌ ప్రైజ్‌ ఇస్తామన్నారు. మన పిల్లలను ..సొంత బిడ్డలుగా భావించి వారిని అత్యుత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దాలని కడియం సూచించారు. ఇక నుంచి 100 శాతం ఫలితాలు గొప్ప కాదు..10/10
జీ. పి.ఏ సాధించడాన్నే పరిగణనలోకి తీసుకుంటామని కడియం తెలిపారు. ఉత్తమ ఫలితాలు, హరిత పాఠశాలలు సాధించిన గురుకులాలు, మోడల్‌ స్కూళ్ల ప్రిన్సిపాళ్ళ ను ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి అభినందించారు. నీట్‌, జె. ఈ. ఈ లలో అత్యధిక ర్యాంక్‌ లు విద్యా శాఖ గురుకులాలు, మోడల్‌ స్కూళ్ల నుంచే రావాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. ఈసారి రాష్ట్ర ఉత్తమ ర్యాంక్‌ లు, నీట్‌, జెఈఈ ర్యాంక్‌ లు అధికంగా సాధిస్తామని ప్రిన్సిపాళ్లు ఉప ముఖ్యమంత్రి కి భరోసా ఇచ్చారు. గేమ్స్‌, స్పోర్ట్స్‌ ను బాగా ప్రోత్సహించాలి. ఇందు కోసం ప్రత్యేకంగా నిధులు ఇస్తున్నామన్నారు. వచ్చే ఏడాది ఇంకా పెంచుతాం. ఇతర రంగాల్లో కూడా విద్యార్థులను ప్రోత్సహించాలని ప్రిన్సిపాళ్లకు మంత్రి సూచించారు. విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు క్రమం తప్పకుండా నిర్వహించాలని, వారికి హెల్త్‌ కార్డ్స్‌ ఇవ్వాలని, తల్లిదండ్రుల తో కూడా వరసగా సమావేశాలు నిర్వహించాలని మంత్రి సూచించారు. విూకు కావలసిన వసతులన్నీ ఇచ్చే బాధ్యత నాదని.. మిగిలిన అన్ని విద్యా సంస్థల కంటే ఈ రెండు విద్యా సంస్థలు అన్ని రంగాల్లో నెంబర్‌ వన్‌ స్థానంలో ఉండేలా విూరు కృషి చేయాలని మంత్రి వారిని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ సంచాలకులు కిషన్‌, మోడల్‌ స్కూళ్ళు, గురుకులాల సంచాలకులు సత్యనారాయణ రెడ్డి , ఆర్‌.ఎం.ఎస్‌.ఏ జె.డి రమేష్‌, ఇతర విద్యా శాఖ అధికారులు పాల్గోన్నారు.