గెలిచినా, ఓడినా ప్రజలమధ్యే ఉంటా

– ఎగ్జిట్‌ పోల్స్‌పై నాకు నమ్మకం లేదు
– జనసేన విశాఖ లోక్‌సభ అభ్యర్థి లక్ష్మీనారాయణ
విశాఖపట్టణం, మే20(జ‌నంసాక్షి) : తాను విశాఖ లోక్‌సభ అభ్యర్థిగా గెలిచినా ప్రజాసేవకే పనిచేస్తానని, గెలవకపోయినా వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని.. రెండింట్లో ఏది జరిగినా ప్రజల మధ్యే ఉంటాననేది ఖాయమని జనసేన విశాఖపట్టణం లోక్‌సభ అభ్యర్థి, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. విశాఖ వన్‌టౌన్‌లో రంజాన్‌ తోఫా పంపిణీ కార్యక్రమం సోమవారం జరిగింది. ఈకార్యక్రమంలో
ఆయన పాల్గొని ముస్లీం లకు రంజాన్‌ తోఫాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన విూడియాతో మాట్లాడుతూ.. ఎగ్జిట్‌ పోల్స్‌తో మాకేవిూ ఆందోళన లేదన్నారు. అనవసరంగా ఎగ్జిట్‌ పోల్స్‌ ఇచ్చి ప్రజల్లో మరింత ఉత్కంఠ కల్గిస్తున్నారని అన్నారు. ఓపికతో ఉంటే ఈ నెల 23న అసలు ఫలితమే వచ్చేస్తుందని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఏ ఫలితం వచ్చినా ప్రజా సమస్యలపై పోరాడాలని మా పార్టీ నిర్ణయించిందని, గెలుపోటములు సహజం అన్నారు. ప్రజల కోసం పనిచేయాలన్న భావనతో మేం ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. అందువల్ల ఎగ్జిట్‌ పోల్స్‌ వల్ల కలిగే ప్రభావం మాపై ఏవిూ కనబడటంలేదన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ ఆధ్వర్యంలో ప్రజలకు సేవ చేసేందుకు తాను రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. జనసేనాని పవన్‌ సూచనల మేరకు ప్రజా సమస్యల పరిష్కారంలో కీలక భూమిక పోషిస్తానని తెలిపారు. రాష్ట్రంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, 23 తరువాత ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా.. ప్రజా సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. పరిష్కారం కాని పక్షంలో ఐక్యంగా పోరాటం సాగించి సమస్యలను పరిష్కరించుకుంటామని లక్ష్మీనారాయణ తెలిపారు. అలా ఓడినా, గెలిచినా నిత్యం ప్రజల మధ్య ఉండటమే తన లక్ష్యంమని, వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడమే నా థ్యేయమని లక్ష్మీనారాయణ తెలిపారు.