జూనియర్‌ కాలేజీల్లో అధ్యాపకుల కొరత

కాంట్రాక్ట్‌ లెక్చరర్లతో నెట్టుకొస్తున్న వైనం
హైదరాబాద్‌,మే4(జ‌నంసాక్షి):  అనేక  ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ఇప్పటికీ కాంట్రాక్ట్‌ లెక్చరర్లతో కాలం వెళ్లదీస్తున్నారు. ఒక్కో జూనియర్‌ కళాశాలలో పది మంది అధ్యాపకులు పనిచేయాల్సి ఉన్నా అలాంటి నియామకాలు లేవు.  ఒక్కో కాలేజీని తీసుకుంటే  ఏడుగురు మాత్రమే రెగ్యులర్‌ అధ్యాపకులు పనిచేస్తుండగా 70మంది కాంట్రక్ట్‌ ప్రాతిపదికన పనిచేస్తున్నారు. మిగితా పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి.  క్షేత్రస్థాయిలో సిబ్బంది నియామకం, జూనియర్‌ కళాశాలల్లో వసతులపై దృష్టి సారించక పోవడంతో ఫలితాలు ఆశించిన మేరకు రావడం లేదు. ఇంటర్‌ ఫలితాల్లో ఇటీవల ఉత్తీర్ణత తగ్గడానికి ఇదీ ఓకారణంగా చెబుతున్నారు.  కళాశాలల్లో అసౌకర్యాలు..అధ్యాపకుల కొరతతో అత్తెసరు మార్కులు రావడంతో విద్యార్థులు నిరాశ చెందుతున్నారు. దీనిని సాకుగా చూపి ప్రైవేట్‌ కాలేజీలు దోపిడీకి తెరతీస్తున్నాయి. అధ్యాపకుల పోస్టులను భర్తీచేయకుండానే నాణ్యమైన విద్యను అందించలేమని గుర్తించడం లేదు. ఇకపోతే  చాలాచోట్ల కళాశాలల్లో కనీస మౌలిక వసతులు లేవు. సరిపడా గదులు, భవన నిర్మాణాలు కరవయ్యాయి. ఈ సమస్యలు జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో  ఫలితాలపై ప్రభావం చూపుతోంది. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలతోపాటు సాంఘిక, గిరిజన, మోడల్‌ కళాశాలలు ఉన్నాయి.  ప్రతి ఏటా కళాశాలలు
ప్రారంభమైన రెండు మూడునెలలకు కాంట్రాక్ట్‌ లెక్చరర్లను నియమించడంతో వారు సిలబస్‌ పూర్తి చేయటమే లక్ష్యంగా పని చేస్తున్నారు. ఈ కారణంగా ఆయా అంశాలపై విద్యార్థులు పట్టుసాధించలేక పోతున్నారు. ఇక్కడ చేనేతరంగం, వ్యవసాయం తప్ప వేరే ఉపాధి అవకాశాలు లేవు. చాలామంది బీద, మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారే. తమ పిల్లలను ఉన్నతంగా చదివి పెద్ద స్థాయికి చేరాలని కళాశాలలకు పంపిస్తున్నామని అక్కడ తగినంత సిబ్బంది, వసతులు లేకపోవడంతో అంతగా ప్రతిభ చూపడం లేదని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.