తుదిశ్వాస వరకు టీడీపీలోనే కొనసాగుతా

– తమవైపు రావాలని రెండు ప్రధాన పార్టీలు నాపై ఒత్తిడి చేశాయి
-రాజకీయ పునరేకీకరణకోసమే పార్టీ మారామనడం సిగ్గుచేటు
– విలేకరుల సమావేశంలో టీడీపీ సీనియర్‌ నేత రేవూరి ప్రకాష్‌రెడ్డి
వరంగల్‌ , నవంబర్‌1(జ‌నంసాక్షి): తన తుదిశ్వాస వరకు తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతానని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్‌ నాయకుడు రేవూరి ప్రకాష్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన వరంగల్‌లో విలేకరులతో మాట్లాడారు. తన వ్యక్తిత్వం దెబ్బతిన్న రోజు ఇంట్లో కూర్చుంటాను తప్ప పార్టీ మాత్రం మారనన్నారు. ఇప్పటికే రెండు ప్రధాన పార్టీలు నాపై ఒత్తిడి తెచ్చాయని రేవూరి అన్నారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తే లేదని ప్రకాష్‌రెడ్డి స్పష్టం చేశారు. టీడీపీలో చంద్రబాబు రేవంత్‌కు పెద్దపీట వేశారన్నారు. కానీ తన సొంత ప్రయోజనాలకోసం రేవంత్‌ పార్టీ మారాడని ఆగ్రహం వ్యక్తంచేశాడు. రేవంత్‌ పార్టీని వీడినంత మాత్రాన తెలుగుదేశానికి తెలంగాణాలో వచ్చిన నష్టమేవిూ లేదని, ఖచ్చితంగా రాబోయే కాలంలో తెదేపాను తెలంగాణాలో బలమైన పార్టీగా నిలుపుతామని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీని వీడి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ములుగు మాజీ ఎమ్మెల్యే ధనసరి అనసూయ(సీతక్క)పై నర్సంపేట రేవూరి ప్రకాష్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్‌లో చేరడం, రాజకీయ పునరేకీకరణ అని సీతక్క అనడం సిగ్గుచేటన్నారు. నక్సలైట్‌గా జీవితం ప్రారంభించి తెలుగుదేశం పార్టీలో చేరిన సీతక్కను చంద్రబాబునాయుడు ఉన్నత స్థానంలో కూర్చోబెట్టారని ఆయన అన్నారు. రాజకీయ పునరేకీకరణ అంటే నాయకులు పార్టీలు మారడం కాదన్న సంగతిని ఆమె గుర్తుపెట్టుకోవాలని ఆయన సీతక్కకు సూచించారు. తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు పార్టీని బలోపేతం చేస్తామని, పార్టీని వీడినవారంతా ముక్కునవేలేసుకొనేలా పార్టీని బలోపేతం చేసి చూపిస్తామని రేవూరి తెలిపారు.