నేటి రెండో విడతకు సర్వం సిద్ధం

82 సర్పంచ్‌ పదవులకు నేడు ఎన్నిక

దూరప్రాంత ఓటర్లను రప్పిస్తున్న అభ్యర్థులు

జనగామ,జనవరి24(జ‌నంసాక్షి): రెండో విడత ప్లలె పోరుకు సర్వం సిద్ధమైంది. రెండో విడతలో భాగంగా నాలుగు మండలాల పరిధిలో శుక్రవారం ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏకగ్రీవమైన 27 సర్పంచ్‌, 317 వార్డు స్థానాలు మినహా 82 సర్పంచ్‌ పదవులకు 234మంది అభ్యర్థులు, 649 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఉదయం 7గంటల నుంచి 1గంట వరకు పోలింగ్‌ తర్వాత 2గంటల నుంచి కౌంటింగ్‌ అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం 966 పోలింగ్‌ కేంద్రాలు, 2017 మంది సిబ్బందిని కేటాయించారు. ఇప్పటికే మొదటి విడత పోలింగ్‌ ముగిసిన మండలాల నుంచి రెండో విడత ఎన్నికలు జరిగే మండలలాకు బ్యాలెట్‌ బాక్స్‌ తరలించారు. రెండో విడత ఎన్నికలు జరిగే గ్రామాలకు పోలింగ్‌ సిబ్బంది, ఎన్నికల సామగ్రిని గురువారం ఆయా మండల పరిషత్‌ కార్యాలయాల్లో పంపిణీ చేసి పోలీసు బందోబస్తు నడుమ వాహనాల్లో పోలింగ్‌ కేంద్రాలకు తరలించారు. రెండో విడత ఎన్నికలు జరిగే ఆయా గ్రామాల్లో ఈనెల 23న సాయం త్రం 5 గంటలకు ప్రచార పర్వానికి తెరపడింది. దీంతో ప్లలెల్లో అభ్యర్థులు ఇప్పుడు గడప గడపకూ వెళ్లి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దూర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను పోలింగ్‌ రోజున ప్లలెకు రప్పించి ఓటేసి వెళ్లే విధంగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. మహిళా అభ్యర్థులు బరిలో ఉన్న గ్రామాల్లో భర్తలు అన్నీ తామై ముందుండి ప్రచారాలు చేస్తున్నారు. కు టుంబీకులు, బంధుగణాన్ని వెంటేసుకొని ఇంటింటికీ తిరిగి మహిళలకు బొట్టు పెట్టుకుంటూ పలుకరిస్తున్నారు. తమకు కేటాయించిన గు ర్తులను చూపుతూ కరపత్రాలను పంచుతున్నారు. మేజర్‌ గ్రామాల్లో ఏకంగా తమ గుర్తులు ప్రజలకు గుర్తుండేలా వస్తువులతోపాటు నమూనా బ్యాలెట్‌ పత్రాలతో ప్రచారం చేస్తున్నారు. చిన్న గ్రామాల్లో ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు సరికొత్త ఎజెండాలను సైతం అభ్యర్థులు తెరపైకి తెస్తున్నారు. జనవరి 25న రెండో విడత పోలింగ్‌ జరిగే గ్రామాల్లో అభ్యర్థులు మాటలు కట్టిపెట్టి ఇంటింటి ప్రచారం చేపట్టారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచిన వారి లెక్క తేలింది. సర్పంచ్‌, వార్డు స్థానాల కోసం రంగంలో నిలిచిన మొత్తం 1736మంది అభ్యర్థులకు గుర్తు లు కేటాయించారు. ఈనెల 25న రెండో విడత ఎన్నికలు జరగాల్సిన గుండాల, దేవరుప్పుల, రఘునాథపల్లి, కొడకండ్ల మండలాల్లోని 109 పంచాయతీలకుగాను 27 పంచాయతీలు, 966 వార్డు స్థానాలకు గాను 317 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 82 పంచాయతీల సర్పం చ్‌ పదవులకు 234 మంది అభ్యర్థులు, 649 వార్డు స్థానాలకు 1502 మంది పోటీ పడుతున్నారు. తొలివిడతో అనేకస్థానాలు టిఆర్‌ఎస్‌ అభ్యర్థులు మెజార్టీతో గెలవడంతో ఆ పార్టీ మద్దతుదారులుగా బరిలో నిలిచిన సర్పంచ్‌, వార్డు స్థానాల అభ్యర్థులు ప్రచారంలో ముందుండి గెలుపు దిశగా సాగుతున్నారు. ఇంటింటి ప్రచారంతో తమకు కేటాయించిన గుర్తులను ఓటర్లకు వివరిస్తూ గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. ఎక్కడికక్కడ మంతనాలు జరుపుతూ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు రాజకీయాలకతీతంగా కొందరు వ్యూహరచన చేస్తుండగా, రాజకీయ పార్టీల మద్దతుతో మరికొందరు గెలుపు కోసం పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్లలెలన్నీ రాజకీయ చర్చలతో వేడెక్కాయి. పార్టీ బలపరిచిన అభ్యర్థులు సర్పంచ్‌, ఉపసర్పంచ్‌ సహా వార్డు మెంబర్‌ స్థానాలు సైతం చేజిక్కించుకునేందుకు ఆయా గ్రామాల్లో స్థానిక నాయకులు, కార్యకర్తలు తమవంతు కృషి చేస్తున్నారు. తమ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు డాక్టర్‌ తాటికొండ రాజయ్య, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, ముత్తిరెడ్డిలు అభ్యర్థుల గెలుపు కోసం కీలక గ్రామాల్లో ప్రచారం చేసారు.