పంపిణీకి సిద్దంగా క్రిస్మస్‌ కానుకలు

నియోజకవర్గానికి వేయి ప్యాకెట్లు

రూ.2 లక్షలు కేటాయించిన ప్రభుత్వం

ఆదిలాబాద్‌,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్న తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్‌ పర్వదినానికి గిఫ్టులను ఇచ్చేందుకు రంగం సిద్దంచేసింది. ప్రతి ఏడాది ఈ కానుకలను అందిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్‌ను పురస్కరించుకొని ప్రతి ఏడాది పండుగ కానుకలు అందిస్తున్న విషయం తెలిసిందే.ఈ ఏడాది సైతం క్రిస్మస్‌ కానుకలు అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కానుకలు జిల్లాకు చేరాయి. నియోజకవర్గానికి వెయ్యి చొప్పన ఆదిలాబాద్‌, బోథ్‌ మొత్తం రెండు వేల గిఫ్టులు త్వరలో పంపిణీ చేసేందుకు మైనార్టీ సంక్షేమశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. అధికారులతో ఏర్పాటు చేసిన కమిటీలు, చర్చీల నిర్వాహకులు పంపిణీ చేయనున్నారు. సామూహిక భోజనాల కోసం నియోజకవర్గానికి రూ.2 లక్షల చొప్పన నిధులు మంజూరయ్యాయి. ఉమ్మడి జిల్లాలో క్రిస్మస్‌ కానుకలు పంపిణీ చేసేందుకు మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు పంపిణీ పూర్తి చేయనున్నారు. ఒక్కో నియోజకవర్గానికి వెయ్యి కానుకలతో పాటు రూ.2 లక్షలు చొప్పున మూడు నియోజవర్గాలకు మొత్తం రూ.4 లక్షలతో సామూహిక భోజనాలు ఏర్పాటు చేయనున్నారు. కమిటీలు, చర్చీల నిర్వాహకులు వీటి కోసం ఏర్పాట్లు చేయనున్నారు. ఇందుకు సంబంధించి నిధులు క్రిస్టియన్‌ సెలబ్రేషన్‌ ఆర్గనైజింగ్‌ కమిటీ అందజేయనున్నది. తెల్లరేషన్‌ కార్డు, ఆధార్‌కార్డు ఉండి సవిూప చర్చీల పాస్టర్లు ధ్రువీకరించిన లెటర్‌ ప్యాడ్‌పై అభ్యర్థుల పేర్లను రాసి కమిటీకి పంపించాల్సి ఉంటుంది. ఆ తరువాత చర్చీల వారీగా లబ్దిదారుల సంఖ్య ప్రకారం గిఫ్టు పాకెట్లను పంపిణీ చేస్తారు.