పెద్దల గుప్పిట్లో కోల్డ్‌ స్టోరేజీలు

పేద రైతులకు అందుబాటులో లేక అందని ధరలు

ఖమ్మం,జూలై27(జ‌నంసాక్షి): గతసీజన్‌లో మిర్చి పండించిన రైతులు నష్టాల్లో మునిగి పోయారు.

ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో తీవ్రంగా నష్టపోయారు. మంచి ధర వచ్చే వరకు నిల్వ చేసుకొనే పరిస్థితి కనిపించడంలేదు. శీతల గిడ్డంగులు అందుబాటులో లేకపోవడం వల్లనే ఇలా జరిగిందని అన్నదాతలు అంటున్నారు. ఖమ్మం, మధిర, తల్లాడ, వైరా, కొణిజర్ల తదితర ప్రాంతాల్లో శీతల గిడ్డంగులు ఉన్నాయి. ఒక్కో గిడ్డంగి సామర్థ్యం లక్ష బస్తాల వరకు ఉంటుంది. ఈలెక్కన ఉభయ జిల్లాల్లో సుమారు 28 లక్షల వరకు బస్తాలను నిల్వ చేయవచ్చు. శీతల గిడ్డంగుల్లో పెట్టే సరకు విషయంలో

రైతులకు అన్యాయం జరుగుతోంది. రైతుల ఫిర్యాదులను పరిశీలించి చర్యలు తీసుకుంటామని జిల్లా మార్కెటింగ్‌ అధికారులు చెప్పారు. అయితే అవి అమలుకావడం లేదు. గిడ్డంగులను సక్రమంగా వినియోగించుకునేలా చేయాలని రైతులు కోరుతున్నారు. సామాన్య రైతులు పంటను నిల్వ చేసుకొనేందుకు

శీతల గిడ్డంగులు ఎక్కడా అందుబాటులో లేని పరిస్థితి నెలకొనడం వల్‌లనే పంటలకు గిట్టుబాటు ధరలు దక్కడం లేదని అన్నారు. జిల్లాలో ఉన్నవన్నీ బడా రైతులు, వ్యాపారులకే కేటాయిస్తుండడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో పంటను తెగనమ్ముకొంటున్నారు. శీతల గిడ్డంగులపై పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. రైతు పేరు చెప్పుకొని కొన్ని శీతల గిడ్డంగుల్లో వ్యాపారులు సరుకు నిల్వ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. గిడ్డంగుల్లో నిల్వ చేసిన సరకు వివరాలు ఆన్‌లైన్‌ చేయాలన్నారు. సరకు నిల్వ చేసిన రైతు పేరు, ఎంత నిల్వ చేశారు? తదితర వివరాలు సేకరించాలన్నారు. ఉద్యానశాఖ శీతల గిడ్డంగుల నిర్మాణానికి సుమారు 50 శాతం వరకు రాయితీ సొమ్ము ఇస్తున్నందున వ్యాపారులు కొందరు దీనిని తమకు అనుకూలంగా మలచుకున్నారు. ఏటా శీతల గిడ్డంగుల్లో చోటుచేసుకుంటున్న మోసాలు ఒక ఎత్తయితే ప్రస్తుతం రైతుల సరకుకు చోటులేకుండా ఖరీదుదారులతో కుమ్మక్కై చేస్తున్న దందా మరో ఎత్తు. దీనిపై కఠిన చర్యలు తీసుకుంటే తప్ప రైతు పండించిన పంట నిల్వ చేసుకొనే సౌకర్యం కలగదన్నారు. గతసీజన్‌లో సుమారు లక్ష ఎకరాల్లో ఈ ఏడాది మిరప సాగు చేయగాపంట చేతికి వచ్చిన సమయంలో సరైన ధలరు లభిస్తే మిరప రైతు పంట బంగారం అయ్యేది. కానీ మార్కెట్‌లోని వ్యాపారులు, శీతల గిడ్డంగుల యాజమానుల నిర్వాకంతో రైతులకు నష్టాలే మిగులున్నాయి. మంచి ధర వచ్చే వరకు శీతల గిడ్డంగుల్లో పెట్టుకుందామంటే ఆ అవకాశాన్ని గిడ్డంగి యజమానులు ఇవ్వలేదు. ఇప్పటికైనా గిడ్డంగులు పారదర్శకంగా పనిచేసేలా చూడాలన్నారు.