ప్రజల ఆకాంక్షలపై దృష్టి సారించాలి

నిరుద్యోగ యువతను విశ్వాసంలోకి తీసుకోవాలి

హైదరాబాద్‌,డిసెంబర్‌5(జ‌నంసాక్షి): తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ఇప్పటికీ నెరవేరని ఆశగానే ఉంది. తాజాగా ఆర్టీసీలో సమ్మెకాలంలో ఉద్యోగాలు చేసిన తాత్కాలిక ఉద్యోగులు కూడా ఆందోళన చెందుతున్నారు. తమకు ఆర్టీసీలోనే ఉద్యోగాలు చూపాలని కోరుతున్నారు. ఇకపోతే వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను గుర్తించి భర్తీ చేయడం ద్వారా నిరుద్యోగుల ఆకాంక్షలను నెరవేర్చాల్సి ఉంది.నిరుద్యోగులు మరోమారు గళం వినిపించిన వేళ వారి ఆకాంక్షలు తీర్చేదిగా ప్రభుత్వచర్యలు ఉండాలి. విమర్శలు చేయకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్షలుగా గుర్తించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. తాజాగా నీళ్లు, నిధులు, నియామకాలు అన్న ఉద్యమ నినాదాన్ని ప్రభుత్వం పక్కదారి పట్టించకుండా జాగ్రత్తలు తీసుకుని, విమర్శకులను వ్యతిరేకులులగా భావించకుండా ముందకు సాగాలి. సిఎం కెసిఆర్‌కు వాస్తవ పరిస్తితులు వివరించడం ద్వారా యావత్‌ తెలంగాణ సమాజం గమనిస్తుందని తెలియచేయాలి. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ శాఖలలో గల ఖాళీలపై ప్రభుత్వం దగ్గర పూర్తిస్థాయి సమాచారం ఉన్నప్పటికీ, ఉద్యోగాలను కేవలం జీతాల కోణంలో చూస్తూ భారంగా భావించరాదు. అనుత్పాదకరంగాలకు నిధులను తగ్గించుకోవాలి. అనవసర కేటాయింపులను తగ్గించాలి. దర్గాలకు, మొహమాటాలకు చెల్లింపులు చేయకుండా ఉంటే తెలంగాణసమాజం కెసిఆర్‌ వెంటనే నడుస్తుందని గుర్తించాలి. ప్రజలే అతిపెద్ద ప్రచారకర్తలు. నిజంగానే ప్రభుత్వానికి బంగారు తెలంగాణ ఏర్పాటు చేయాలనే దృఢ సంకల్పం, చిత్తశుద్ధి ఉంటే పరిపాలనా రంగం సక్రమంగా పనిచేసే విధంగా చూడాలి. దానికోసం ప్రతి శాఖకు సంబంధించిన నియమకాలు నిష్పక్షపాతంగా జరిపి, ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకాన్ని పెంపొందించుకోవాలి. అంతేగానీ ప్రతీదాన్ని రాజకీయకోణంలో చూడడం వల్ల ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లిపోతుంది. అంతేగాకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ప్రతిపక్ష పార్టీలకు ఒక బలమైన కారణం దొరుకుతుంది. అయినప్పటికీ ప్రభుత్వంపై తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నమ్మకం ఉంది. కెసిఆర్‌ విషయంలో ఇంకా విశ్వాసంతో ఉన్నారు. తమకు తప్పకుండా న్యాయం జరుగుతుందని తెలంగాణ సమాజంలో భరోసా ఉంది. కొత్త రాష్ట్రం, కొత్త ప్రభుత్వం, కొత్త విధానాలు, బాలారిష్టాలు తొలిగి మంచిరోజులు వస్తాయన్న ఆశతో ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే పూర్తి స్థాయిలో ఉద్యోగ నియామకాలు చేపట్టవలసిన అవసరం ఎంతైనా వుంది. అలాగే అనవసర ఖర్చులు తగ్గించుకుని యువతకు మేలుచేసేలా నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడు కెసిఆర్‌కు ఎదురుండదు. కాంగ్రెస్‌, బిజెపి చేస్తున్న విమర్శలు పట్టించుకోకుండా తెలంగాణ సమాజం గురించి ఆలోచన చేయాలి.