ప్రాజెక్టులపై ఎవరి వాదన వారిది

ఎవరి లెక్కలు కరెక్టో ఎవరు చెప్పాలి

గతంలో జరిగిన లెక్కలు కాంగ్రెస్‌ చెప్పగలదా?

హైదరాబాద్‌,ఆగస్ట్‌18(జ‌నం సాక్షి): కాంగ్రెస్‌ పాలనా కాలంలో ప్రాజెక్టులపై ఖర్చుకు స్పష్టత లేదు. దీనిపై వివరాలు చెప్పడానికి ప్రభుత్వం కూడా ముందుకు రావడం లేదు. గత పదేళ్ల కాలంలో జలయజ్ఞంలో చేపట్టిన పనులు,నిధుల కేటాయింపులపై శ్వేతపత్రం విడుద చేసి వుంటే బాగుండేది. నిజానికి జలయజ్ఞం పేరుతో నిధులు దోచుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. అలాగే పదేళ్ల పాలనపై వైట్‌ పేపర్‌ కూడా ఇచ్చి ముందు సచ్చీలతను నిరూపించుకోవాలి. ఆ తరవాత మాత్రమే కాంగ్రెస్‌ టిఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని నిలదీస్తే ప్రజల్లో విశ్వాసం ఉంటుంది. కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వివిధ ప్రాజెక్టులు చేపడుతున్న సమయంలో కాకి లెక్కలు చెప్పారని కాంగ్రెస్‌ పార్టీ విమర్శలు చేస్తోంది. ప్రాజెక్టుల పేరుతో దోచుకుంటున్నారని అంటున్నారు. నిజంగానే కాకి లెక్కలు చెప్పినా, నిధులు దుర్వినియోగం చేసినా ఏ ప్రభుత్వం ఉన్నా నిలదీయాల్సిందే. అందుకు కెసిఆర్‌ అతీతుడేం కాదు. కానీ తాముచెప్పింది కరెక్ట్‌ అన్నది ఎవరు నిర్ధారించాలో చెప్పాలి. అందుకు నిపుణలుతో అధ్యయనం చేయించగలరా? పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేయకుండా ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ పేరుతో వేల కోట్ల రూపాయల దోపిడీ జరిగిందని కాంగ్రెస్‌ ఆరోపించే ముందు దీనికి ఓ ఆమోదం రావాలి. పునరాకృతి పేరిట భారతదేశంలోనే అతి పెద్ద కుంభకోణానికి తెరాస ప్రభుత్వం తెరలేపిందని కాంగ్రెస్‌ పేర్కొంటుంది. పారదర్శకతకు చోటు లేకుండా గుత్తేదారులతో కుమ్మక్కై టెండర్‌ పక్రియ చేపట్టిందని విమర్శించింది. సాగునీటి రంగంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ శాసనసభలో గతంలో ఇచ్చిన పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. తెలంగాణ వాస్తవ జలదృశ్యం’పేరుతో కాంగ్రెస్‌ కూడా ఓ పేపర్‌ ఇచ్చింది. అయితే ప్రజలు ఎవరిని నమ్మాలి. ఏది నిజమన్న వాస్తవం ఎలా తెలియాలన్న గందరగోళంలో ప్రజలు ఉన్నారు. ప్రదర్శన ఇచ్చింది. గత చరిత్ర అంతా వివాదంగా ఉన్న కాంగ్రెస్‌ నిజాలుచెప్పినా నమ్మలేని పరిస్థితి ఉంది. కోటి ఎకరాలు సాగులోకి తెస్తామని ముఖ్యమంత్రి కాకి లెక్కలు చెబుతున్నారని కాంగ్రెస్‌ ఆరోపించింది. తెలంగాణలో కేవలం 19 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీటి వసతి ఉందన్నారు. 1956 నాటికే తెలంగాణలో 17.38 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటి వసతి ఉందని అంటోంది. 2014 నాటికి 98.47 లక్షల ఎకరాల ఆయకట్టుకు అవసరమైన ప్రాజెక్టులున్నాయి. ముఖ్యమంత్రి లెక్క ప్రకారమే తెలంగాణలో సాగుకు యోగ్యమైన భూమి కోటి 11 లక్షల ఎకరాలు. అంటే 10 నుంచి 13 లక్షల ఎకరాలకు రూ.లక్షన్నర కోట్ల ఖర్చు న్యాయమా? అంటూ పిసిసి చీఫ్‌ ఉత్తమ్‌ ప్రశ్నించారు. నిజానికి ఇదే నిజమైతే నిపుణులతో అధ్యయనం చేయించాలి. వారితో చర్చ చేయాలి. అన్ని వర్గాలను కూడాగట్టుకుని ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఏ మేరకు ప్రాజెక్టుల్లో ఎలా అవిఆనీతి జరిగిందో,జరుగుతుందో తెలియ చెప్పాలి. కాళేశ్వరం ప్రాజెక్టును పాత డిజైన్‌తో యథావిధిగా నిర్మిస్తే 90 శాతం నిధులను కేంద్రం ఇస్తుందన్నారు. రిజర్వాయర్ల పెంపు సామర్థ్యం ప్రజలకు, ప్రభుత్వ ఖజానాకు మోయలేని భారం అంటూ కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది.