రాజధాని అమరావతిపై ప్రభుత్వం ప్రకటన చేయాలి

మార్పుపై స్పష్టత ఇచ్చి గందరగోళం తొలగించాలి
రాజధాని రైతులకు 10వేల పెన్షన్‌ఇవ్వాలి
వెంటనే ఇసుక విధానం ప్రకటించాలి
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్‌
కడప,ఆగస్ట్‌24(జనంసాక్షి): రాజధాని అమరావతిపై ప్రభుత్వం ప్రకటన చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్‌ చేశారు. రాజధాని మారుస్తామంటు చేస్తున్న ప్రకటనలపై స్పస్టత ఇవ్వాలన్నారు. ఒకవేళ మారిస్తే ఎక్కడికి మారుస్తారు..ఎందుకు మారుస్తున్నారో చెప్పాలన్నారు. ఇంతకాలం రైతులు తమ వ్యవసాయాన్ని కోల్పోయి భూమి అప్పగించారని, దానిని ఏం చేయబోతున్నారో కూడా చెప్పాలన్నారు. కడపలో నూతన సిపిఎం కార్యాలయంలో మధు, మాజీ ఎమ్మెల్యే గఫూర్‌లు శనివారం విూడియాతో సమావేశమయ్యారు. రాజధాని రైతులకు కౌలురుణం, పెన్షన్‌ చెల్లించాలన్నారు. ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు ఇబ్బంది పడుతున్నారన్నారు. లక్షా 20వేల మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగుల పరిస్థితి ఏంటని
ప్రశ్నించారు. ప్రధాన సమస్యలపై అఖిలపక్ష భేటీ నిర్వహించాలని మధు డిమాండ్‌ చేశారు.
రాష్ట్రంలో ప్రజలను నాలుగు ప్రధాన సమస్యలు వేదనకు గురిచేస్తున్నాయన్నారు. ఇసుక విధానం మార్పుల కారణంగా ప్రజలను ప్రభుత్వం ఇబ్బంది పెట్టడం తగదని సూచించారు. జీవనోపాధి లేక భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన చెందారు. బొత్స వ్యాఖ్యలే రాజధాని వివాదానికి కారణమని ఆరోపించారు. రాజధాని ప్రాంతంలోని రైతాంగానికి వెంటనే లీజు, 10 వేల రూపాయల చొప్పున పెన్షన్‌ చెల్లించాలని డిమాండ్‌ చేశారు. మాజీ ఎంపీ గఫూర్‌ మాట్లాడుతూ.. రాజధాని మార్పుపై ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని కోరారు. వివిధ శాఖల్లో పని చేస్తున్న అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు ప్రశ్నార్థకంగా మారాయన్నారు. వివిధ రంగాల్లో పని చేస్తున్న లక్షా ఇరవై వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించారు. తీవ్రమైన వర్షా భావ పరిస్థితుల కారణంగా నష్టపోయిన అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన చెందారు. వెనుకబడిన సీమ ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రధాన సమస్యలపై అఖిల పక్ష కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి గఫూర్‌ సూచించారు.