రుణాలు పక్కదారి పట్టిస్తే చర్యలు

మెదక్‌,నవంబర్‌22(జ‌నంసాక్షి): ప్రభుత్వం స్వయం ఉపాధి కల్పించడం కోసం మంజూరు చేసే సబ్సిడీ రుణాలు పక్కదారి పట్టిస్తే సంబంధిత లబ్ధిదారుడిపై చర్యలు తీసుకుంటామని విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు హెచ్చరించారు. స్వయం ఉపాధి నిమిత్తం ప్రభుత్వం నుంచి బ్యాంకుల ద్వారా సబ్సిడీ రుణాలు పొందిన పలువురిని విచారించారు. ఈసందర్భంగా ప్రభుత్వం మంజూరు చేసిన సబ్సిడీ రుణాలు ఏవిధంగా సద్వినియోగం చేసుకుంటున్నారో లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం కోసం ప్రభుత్వం బ్యాంకుల ద్వారా సబ్సిడీ రుణాలు మంజూరు చేస్తుందన్నారు. ప్రభుత్వం మంజూరుచేసే రుణాలు సద్వినియోగపరుచుకుని ఆర్థికాభివృద్ధిని సాధించాలని సూచించారు. రుణాలు పొందిన లబ్ధిదారులు యూనిట్లను ఏర్పాటు చేసుకోకుండా నిధులు పక్కదారి పట్టిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.