మహిళా సంక్షేమంలో తెలంగాణ ఆదర్శం


సఖి కేంద్రాల ద్వారా పటిష్టమైన చర్యలు
సఖి కేంద్రానికి శంకుస్థాపనలో మంత్రి సత్యవతి
హైదరాబాద్‌,అక్టోబర్‌22 (జనంసాక్షి):  మహిళల రక్షణ విషయంలో దేశం గర్వించే విధంగా తెలంగాణ రాష్ట్రం కృషి చేస్తోందని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. సఖి కేంద్రాలను పటిష్టంగా ఉపయోగించుకుంటున్నాయని అన్నారు. ఇతర రాష్టాల్రు ఇక్కడకు వచ్చి అధ్యయనం చేసే విధంగా సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతుందన్నారు. మహిళల అన్ని సమస్యల పరిష్కారానికి వన్‌ స్టాప్‌ సెంటర్‌గా పని చేసే హైదరాబాద్‌ జిల్లా సఖీ కేంద్రానికి శుక్రవారం బంజారాహిల్స్‌, రోడ్‌ నంబర్‌ 12, మిథిలా నగగ్‌లో మంత్రి శంకుస్థాపన చేసిన మాట్లాడారు. సఖీ కేంద్రాలు దేశ వ్యాప్తంగా ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో వీటిని ప్రభుత్వం సమర్థవంతంగా వినియోగించుకుంటుందని తెలిపారు. సఖీ కేంద్రానికి కేంద్రం నుంచి నిధులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం రూ.40 లక్షల రూపాయలు అదనంగా ఇచ్చి పెద్ద భవనం నిర్మాణం చేస్తున్నామని పేర్కొన్నారు. మహిళల రక్షణ విషయంలో దేశంలోని వివిధ రాష్టాల్రు ఇక్కడకు వచ్చి అధ్యయనం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులలో కూడా మార్పు రావాలని మంత్రి తెలిపారు. ఆడపిల్లల పట్ల నేరాలకు పాల్పడిన దోషులను కూడా సకాలంలో పట్టుకుని శిక్షిస్తున్నామని గుర్తు చేశారు. రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అప్పటికప్పుడు సొంత భవనాలు లేక అద్దె భవనాలలో సఖీ కేంద్రాలు నిర్వహిస్తున్నాం. అక్కడ కూడా త్వరలోనే సొంత భవనాలు నిర్మించి, అందులోకి తరలిస్తాంమని స్పష్టం చేశారు.మహిళల సమస్యల పరిష్కారం కోసం పోలీసుల ఆధ్వర్యంలో భరోసా కేంద్రం, మహిళా, శిశు సంక్షేమ శాఖ, కలెక్టర్‌ ఆధ్వర్యంలో సఖీ కేంద్రం నడుస్తున్నాయని వివరించారు. మహిళల పట్ల నేరాలు తగ్గించే విధంగా, వారికి న్యాయ పర సేవలు సకాలంలో ఇచ్చే విధంగా ఈ సఖీ కేంద్రాల ద్వారా పని చేస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మేయర్‌ గద్వాల విజయ లక్ష్మి, ఎమ్మెల్సీ వాణీ దేవి, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్‌, మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌ ప్రత్యేక కార్యదర్శి దివ్య దేవరాజన్‌, కలెక్టర్‌ ఎల్‌. శర్మన్‌, జిల్లా సంక్షేమ అధికారి అక్కేశ్వర్‌ రావు, ఆర్‌ అండ్‌ బి ఎస్‌.ఈ పద్మనాభ రావు తదితరులు ఉన్నారు.