అతి పెద్ద లోహ నిక్షేపాలు తాలిబన్ల హస్తగతం


కాబూల్‌,ఆగస్ట్‌18(జనంసాక్షి): ఆప్ఘనిస్తాన్ను తాలిబన్లు హస్తగతం చేసుకోవడంతో ఆ దేశంలో ఉన్న ప్రజలు భయంతో పారిపోతున్నారు. కాబుల్‌ ఎయిర్‌ పోర్ట్లో భారీ సంఖ్యలో జనాలు ఉన్న వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇక కాబుల్లోని ప్రపంచ ఇంధన ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ఖనిజాల నిక్షేపాలను సైతం నియంత్రించే సామర్థ్యాన్ని హస్తగతం చేసుకుంటున్నారు తాలిబన్లు. పదేళ్లుగా దాదాపు పూర్తిగా ఉపయోగంలోకి రాకుండా ఉన్న లిథీయం నిక్షేపాలపై కూడా పట్టు సాధించారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ పునరుత్పాదక శక్తి బ్యాటరీస్కు యూజ్‌ అయ్యే ఖనిజ వనరులు మైనింగ్‌ ట్రేడిరగ్ను తాలిబన్లు సమర్థవంతంగా నిర్వహించగలరా? అనే చర్చ ప్రపంచవ్యాప్తంగా షురూ అయింది. ఖనిజాలు విలువైన లోహం లిథియం నిక్షేపాలను ప్రత్యామ్నాయ ఆర్థిక వనరుగా మార్చడంలో ఏ మేరకు సక్సెస్‌ అవుతారు? అనేది చర్చనీయాంశంగా ఉంది. అమెరికన్‌ జియాలజిస్టులు ఆప్ఘనిస్తాన్‌ దేశంలోని విస్తారంగా ఉన్న ఖనిజ సంపదను కనుగొన్న తర్వాత 2010లో ‘సౌదీ అరేబియా ఆఫ్‌ లిథియం’ గా పిలిచిన లిథియం ఖనిజ సంపదపై కూడా తాలిబన్లు పట్టు సాధించేశారు. వీటి విలువ కనీసం 1 ట్రిలియన్‌ డాలర్లుగా ఉంటుందని గతంలోనే అంచనా వేశారు. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ వెహికల్స్కు ఇప్పుడు మార్కెట్‌ లో డిమాండ్‌ బాగానే ఉంది. ఇకపోతే ఈ వెహికల్స్కు అవసరమయ్యే పునరుత్పాదక శక్తిని అందించే బ్యాటరీస్కు సిల్వర్‌ మెటల్‌ చాలా అవసరం. ఈ నేపథ్యంలోనే లిథియంకు ఫుల్‌ డిమాండ్‌ ఉంది. అయితే అగ్రశ్రేణి లిథియం ఉత్పత్తిదారు అయిన చైనా నుంచి అమెరికా తన ఇంధన సరఫరా గొలుసులను విడదీయాలని చూస్తున్నది. ఈ క్రమంలోనే ఆప్ఘనిస్తాన్‌ ఖనిజ సంపద తాలిబాన్‌ నియంత్రణలోకి పోవడం అంటే అమెరికా ఆర్థిక ప్రయోజనాలకు దెబ్బేనని నిపుణుల అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాలిబన్లు ఎలాంటి చర్యలకు పూనుకుంటారనే నిపుణులు చర్చించుకుంటున్నారు. అయితే తాలిబన్లు వ్యూహాత్మకంగానే ఖనిజాలపై పట్టు సాధించారని వాషింగ్టన్‌ థింక్‌ ట్యాంక్‌ సెంటర్‌ ఫర్‌ స్ట్రాటజిక్‌ రిస్క్‌ ఎన్విరాన్మెంటల్‌ సెక్యురిటీ ప్రోగ్రామ్‌ హెడ్‌ రాడ్‌ స్కూనోవర్‌ తెలిపారు. తాలిబన్ల మనసులో ఏముంది? ఈ ఖనిజాలను వారు ఉపయోగించుకుంటారా? లేదా? అనేది ముఖ్యమైన ప్రశ్నగానే ఉంది. ఆప్ఘనిస్తాన్‌ అధ్యక్షుడు అశ్రఫ్‌ ఘనీ ఖనిజాలను ఒక శపంగా పేర్కొనేవాడు. తాలిబన్ల మనసులో ఏముందో మరి.. అయితే ఖనిజాలు ఆప్ఘాన్కు రెండు వైపులా పదునున్న కత్తిలాంటివని కొందరి అభిప్రాయం. కానీ అంతర్జాతీయంగా లిథియంకు డిమాండ్‌ బాగా పెరుగుతున్నది. గ్లోబల్‌ డిమాండ్‌ నేపథ్యంలో ఖనిజ సంపదను ప్రత్యామ్నాయ ఆర్థిక వనరుగా మార్చుకోవడం మంచిదేనని కొందరు ఆర్థికవేత్తల అభిప్రాయం. దీని ద్వారా ఆప్ఘాన్‌ దేశానికి ఇన్కమ్‌ కూడా బానే వచ్చే చాన్సెస్‌ ఉంటాయి. గతంలో అఫ్గన్‌ అధికారులు దేశంలో అమెరికా సైనిక ఉనికిని విస్తరించేందుకు ప్రలోభ పెట్టి మరీ కొన్ని మైనింగ్‌ ఒప్పందాలకు ప్రయత్నించారు. అయినప్పటికీ వాటిని అడ్డుకున్నారు కొందరు. అపారమైన ఖనిజ నిక్షేపాలు అభివృద్ధి చెందుతున్న దేశాలలో అవినీతి హింసను పెంచుతున్నట్లు పలు అధ్యయనాలు పేర్కొంటున్న క్రమంలో ఆప్ఘాన్‌ పరిస్థితి ఎలా ఉండబోతుంది? అని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల పోరాటాల ఫలితంగా దేశంలోని భౌతికమైన మౌలిక సదుపాయాలు రోడ్లు విద్యుత్‌ ప్లాంట్లు రైల్వేలు ఏర్పడగా అవి ఇప్పుడు ధ్వంసమయ్యే చాన్సెస్‌ ఉంటాయి. ఈ నేపథ్యంలో స్వాధీనం చేసుకున్న నగరాల్లో ప్రాథమిక ప్రజా సేవలు కనీస మౌలిక సదుపాయాల కల్పనకే ప్రజలు కష్టపడాలన్నారు. తాలిబన్ల చర్యలు ఎలా ఉండబోతున్నాయనేది ఇప్పడప్పుడే అంతు చిక్కబోదనేది మరో వాదన.