సర్కారు లాంఛనాలతో.. సంస్కరణల యోధుడికి అంతిమ సంస్కారం


` అశ్రునయనాలతో మన్మోహన్‌ సింగ్‌కు తుది వీడ్కోలు
` నిగమ్‌బోధ్‌ ఘాట్‌లో మాజీ ప్రధాని అంత్యక్రియలు
` నివాళి అర్పించిన రాష్ట్రపతి ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్‌కడ్‌
` ప్రధాని మోడీ, సోనియా, రాహుల్‌,ఖర్గే, ప్రియాంక తదితరులు
` కాంగ్రెస్‌ కార్యాలయం నుంచి ఘాట్‌ వరకు అంతిమయాత్ర
న్యూఢల్లీి(జనంసాక్షి): ఇక సెలవ్‌ అంటూ ఆర్థికవేత్త మన్మోహన్‌ నింగికేగారు. దివంగత మాజీ ప్రధానికి వీడ్కోలు పలికారు. దివికేగిన దివంగత నేతకు ప్రముఖులు కడసారి శ్రద్ధాంజలి ఘటించారు. అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అంత్యక్రియలు ముగిశాయి. దిల్లీలోని నిగమ్‌బోధ్‌ ఘాట్‌లో ఆయన పార్థివదేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ పాడె మోశారు.రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, జేపీ నడ్డా, కిరణ్‌ రిజిజు, కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, దిల్లీ లెప్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా హాజరై మాజీ ప్రధానికి తుది వీడ్కోలు పలికారు. త్రివిధ దళాల అధిపతులు మన్మోహన్‌కు నివాళులర్పించారు. అంత్యక్రియలకు దిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ హాజరయ్యారు. భూటాన్‌ రాజు జిగ్మే ఖేసర్‌ నాంగ్యల్‌ వాంగ్‌చుక్‌, విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు. మన్మోహన్‌ పార్థివదేహాన్ని పార్టీ నేతలు, కార్యకర్తల సందర్శనార్థం శనివారం ఉదయం ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తీసుకువచ్చారు. కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌, సోనియా, ప్రియాంక గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఎంపీ మల్లు రవి తదితరులు నివాళులర్పించారు. తర్వాత అక్కడినుంచి నిగమ్‌బోధ్‌ ఘాట్‌ వరకు అంతిమయాత్ర కొనసాగింది. ఈ సమయంలో రాహుల్‌.. మన్మోహన్‌ కుటుంబం వెన్నంటే ఉన్నారు.92 ఏళ్ల మన్మోహన్‌ సింగ్‌ వయసురీత్యా తలెత్తిన అనారోగ్య సమస్యలతో గురువారం రాత్రి ఇంటివద్ద అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారు. దీంతో కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మన్మోహన్‌ పదేళ్ల పాటు దేశానికి ప్రధానిగా పని చేశారు. అంతకుముందు ఆర్‌బీఐ గవర్నర్‌గా వ్యవహరించారు. ప్రధానిగా పీవీ నరసింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. అంతకుముందు మన్మోహన్‌ సింగ్‌ మృతికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సంతాపం తెలిపారు. మాజీ ప్రధాని సతీమణి గురుశరణ్‌ సింగ్‌, కుటుంబసభ్యులకు బైడెన్‌ దంపతులు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈమేరకు వైట్‌హౌస్‌ ఓ ప్రకటన విడుదల చేసింది.
మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియల విషయంలో వివాదం
మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు ఢల్లిలోని నిగమ్‌ బోథ్‌లో జరిగాయి. ఆయన స్మారకం కోసం ప్రత్యేకంగా స్థలం కేటాయించాలని, కాంగ్రెస్‌ పార్టీ కేందప్రభుత్వానికి లేఖ సైతం రాసింది. దీనిపై కాంగ్రెస్‌, బీజేపీ నేతల మధ్య రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి. కేంద్రం మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియల విషయంలో సంప్రదాయాలను పాటించడం లేదని కాంగ్రెస్‌ పేర్కొంది. ఇదే సమయంలో గతంలో కాంగ్రెస్‌ ఎలాంటి సంప్రదాయాలు పాటించిందో తెలుసుకోవాలని బీజేపీ నేతలు కౌంటర్‌ ఇచ్చారు. ఈ క్రమంలో ఢల్లీిలోని రాజ్‌ఘాట్‌లో అంత్యక్రియలు జరగని మాజీ ప్రధానుల అంశం తెరపైకి వచ్చింది. దేశ రాజకీయాల్లో ఓ ప్రధాని అంత్యక్రియల విషయం వార్తల్లో నిలవడం ఇదే తొలిసారి కాదు. గతంలో ముగ్గురు ప్రధానుల అంత్యక్రియలు దేశం బయటే జరిగాయి. ఢల్లీిలో అంత్యక్రియలు జరగని ముగ్గురు ప్రధానుల్లో తెలుగువాడు పివి నరసింహారావు కూడా ఉన్నారు. ఆయనపట్ల అప్పట్లో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నా దారుణంగా వ్యవహరించింది. భారతదేశానికి 1991 నుండి 1996 వరకు భారత ప్రధానిగా పనిచేసిన పీవీ నరసింహారావు 2004 డిసెంబర్‌ 23న తుదిశ్వాస విడిచారు. ఆ సమయంలో ఢల్లీిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉండగా ప్రధానమంత్రిగా మన్మోహన్‌ సింగ్‌ ఉన్నారు. పీవీ నరసింహారావు అంత్యక్రియలు ఢల్లిలోనే నిర్వహించాలని ఆయన కుటుంబ సభ్యులు తొలుత భావించారు. కానీ, కాంగ్రెస్‌లోని కొందరు సీనియర్‌ నేతలు పీవీ అంతిమ సంస్కారాలు హస్తినలో కాకుండా హైదరాబాద్‌లో నిర్వహించేలా అధిష్ఠానంపై ఒత్తిడి తీసుకువచ్చారు. ఈ అంశంపై ఢల్లీిలో ఎన్నో చర్చలు జరిగాయి. అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ సైతం పీవీ అంత్యక్రియలు ఢల్లీిలో నిర్వహించేందుకు సానుకూలంగా ఉన్నప్పటికీ పార్టీలో సీనియర్ల నుంచి వచ్చిన ఒత్తిడితో ఏమి చేయలేకపోయారని అప్పట్లో మన్మోహన్‌ సింగ్‌ విూడియా సలహాదారుగా ఉన్న సంజయ్‌ బారు గతంలో చెప్పిన విషయం తెలిసిందే. చివరకు పీవీ అంత్యక్రియలు హైదరాబాద్‌లో నిర్వహించారు. కాంగ్రెస్‌ హయాంలో ఢల్లీిలో పీవీ నరసింహరావు స్మారకం నిర్మించాలనే చర్చ జరిగినప్పటికీ నిర్మాణం కాలేదు. తెలంగాణాకు చెందిన పీవీ నరసింహరావు దేశ ప్రధానిగా సేవలు అందించినప్పటికీ ఆయన అంత్యక్రియలు ఢల్లీిలో జరగలేదు.1989 నుంచి 1990 వరకు భారత ప్రధానిగా పనిచేసిన వీపీ సింగ్‌ 2008లో ఢల్లీిలో మరణించారు. ఢల్లీిలో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తారనే చర్చ జరిగింది. చివరికి ఆయనను అలహాబాద్‌కు తీసుకెళ్లారు. ఆ సమయంలో కుటుంబ సభ్యుల కోరిక మేరకు అంత్యక్రియలు ప్రయాగ్‌రాజ్‌లోని సంగం ఒడ్డున నిర్వహించారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించగా.. ప్రభుత్వ ప్రతినిధిగా అప్పటి కేంద్రమంత్రి సుభోద్కాంత్‌ సహాయ్‌ సింగ్‌ వీపీ సింగ్‌ అంత్యక్రియలు హాజరయ్యారు. ఆ తర్వాత స్మారక చిహ్నం ఢల్లీిలో నిర్మించాలనే ప్రయత్నం చేసినా నిర్మాణం జరగలేదు. 1977 నుండి 1979 వరకు ప్రధానమంత్రిగా పనిచేసిన మొరార్జీ దేశాయ్‌ 1995లో ముంబైలోని జస్లోక్‌ ఆసుపత్రిలో కన్నుమూశారు. మొరార్జీ కుటుంబ సభ్యుల కోరిక మేరకు సబర్మతి ఒడ్డున ఆయన అంత్యక్రియలు జరిగాయి. మొరార్జీ అంత్యక్రియలకు అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు హాజరయ్యారు. అంత్యక్రియల అనంతరం మొరార్జీ చితాభస్మాన్ని ఢల్లీికి తరలించారు. మాజీ ప్రధానులు జవహర్‌లాల్‌ నెహ్రూ, లాల్‌బహదూర్‌ శాస్త్రి, ఇందిరాగాంధీ, చంద్రశేఖర్‌, చౌదరి చరణ్‌ సింగ్‌, రాజీవ్‌ గాంధీ, ఐకే గుజ్రాల్‌, అటల్‌ బిహారీ వాజ్‌పేయి అంత్యక్రియలు ఢల్లీిలోనే జరిగాయి. వీరిలో నెహ్రూ, శాస్త్రి, ఇందిరాగాంధీ, చౌదరి చరణ్‌, చంద్రశేఖర్‌, రాజీవ్‌ గాంధీ, అటల్‌ బిహారీ వాజ్‌పేయి స్మారకాలకు ప్రత్యేక స్థలాన్ని కేటాయించారు. ఈ ప్రధానులతో పాటు సంజయ్‌ గాంధీ అంత్యక్రియలు రాజ్‌ఘాట్‌లో నిర్వహించారు.

మన్మోహన్‌కు నివాళి కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ
` రేపు శాసనసభ సమావేశం ఏర్పాటు
హైదరాబాద్‌(జనంసాక్షి):దివంగత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు నివాళి అర్పించేందుకు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఈ నెల 30వ తేదీన జరగనుంది. సోమవారం ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కానుంది. సంతాప దినాల్లో భాగంగా మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు శాసన సభ నివాళులర్పించనుంది. ªూరత మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్‌ సింగ్‌(92) గురువారం రాత్రి కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా వృద్దాప్య సంబంధ సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి స్పృహ కోల్పోవడంతో కుటుంబసభ్యులు దవాఖానకు తరలించారు. దాదాపు గంటన్నర పాటు ఆయనకు చికిత్స అందించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని, 9.51 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారని ఎయిమ్స్‌ ప్రకటించింది. మన్మోహన్‌ మృతికి సంతాప సూచకంగా కేంద్ర ప్రభుత్వం 7 రోజుల సంతాప దినాలను కూడా ప్రకటించింది.

 

మన్మోహన్‌ అంత్యక్రియల్లో నిర్లక్ష్యం
` ప్రత్యేక స్థలం కేటాయించకపోవడం దారుణం: రాహుల్‌
న్యూఢల్లీి,డిసెంబర్‌28(జనంసాక్షి):మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అంత్యక్రియలను శనివారం ఢల్లీి నిగమ్‌బోధ్‌ ఘాట్‌ వద్ద నిర్వహించడం వివాదానికి దారి తీసింది. మాజీ ప్రధానిని, సిక్కు సమాజాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం ’పూర్తిగా అవమానించింది’ అని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ఇతర నేతలకు ప్రత్యేక అంత్యక్రియల ప్రదేశాలు కేటాయించిన సందర్భాలను రాహుల్‌ ఉటంకించారు.అయితే కాంగ్రెస్‌ రాజకీయాలకు పాల్పడుతోందని బిజెపి ఆరోపించింది. మన్మోహన్‌ సింగ్‌ను ’ఎన్నడూ గౌరవించని’ కాంగ్రెస్‌ ’ఆయన మరణం తరువాత రాజకీయాలకు పాల్పడడం శోచనీయం’ అని బిజెపి సీనియర్‌ నేత సుధాంశు త్రివేది అన్నారు. లాల్‌ బహదూర్‌ శాస్త్రి, పివి నరసింహారావు సహా గాంధీయేతర నేతలకు కాంగ్రెస్‌ ఎన్నడూ సముచిత గౌరవం ఇవ్వలేదని త్రివేది ఆరోపించారు. సింగ్‌ స్మారకచిహ్నానికి ప్రభుత్వం స్థలం కేటాయిస్తుందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేకు, సింగ్‌ కుటుంబానికి కేంద్ర హోమ్‌ శాఖ మంత్రి అమిత్‌ షా ఇప్పటికే వర్తమానం పంపినట్లు హోమ్‌ మంత్రిత్వశాఖ శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తరువాత ఒక ప్రకటన జారీ చేయడం ద్వారా కాంగ్రెస్‌ ఆరోపణను ఖండిరచిన తరువాత,సింగ్‌ అంత్యక్రియలు జరిగిన కొన్ని గంటల తరువాత రాహుల్‌ ఆ వ్యాఖ్యలు చేశారు. ఖర్గే శుక్రవారం ఉదయం సింగ్‌ కుటుంబాన్ని సంప్రదించిన పిమ్మట స్మారకచిహ్నం ఏర్పాటయ్యే చోట అంత్యక్రియలు నిర్వహించవలసిందని ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. అయితే, ఆ డిమాండ్‌కు ప్రభుత్వం అంగీకరించలేదు. దీనితో ’దేశ తొలి సిక్కు ప్రధాని’ని అధికార బిజెపి అవమానించిందని కాంగ్రెస్‌ ఆరోపించింది. సింగ్‌ను ’భారత మాత్ర గొప్ప పుత్రుడు, సిక్కు సమాజం నుంచి తొలి ప్రధాని’ అని రాహుల్‌ అభివర్ణిస్తూ, శనివారం నిగమ్‌బోధ్‌ ఘాట్‌లో అంత్యక్రియలు నిర్వహించడం ద్వారా ప్రస్తుత ప్రభుత్వం ఆయనను పూర్తిగా అవమానించింది’ అని ఆరోపించారు. ’ఇప్పటి వరకు మాజీ ప్రధానులు అందరినీ గౌరవిస్తూ, ప్రతి ఒక్కరూ ఏమాత్రం అసౌకర్యం లేకుండా అంతిమ దర్శనం చేసుకుని, శ్రద్దాంజలి ఘటించేందుకు వీలుగా అధీకృత శ్మశాన వాటికల్లో వారి అంత్యక్రియలు నిర్వహించడమైంది’ అని ఆయన తెలిపారు. సింగ్‌ అత్యధిక గౌరవానికి, స్మారక చిహ్నానికి అర్హుడని రాహుల్‌ పేర్కొన్నారు. ’దేశ మహోన్నత పుత్రునికి, ఆయనకు గర్వకారణమైన సమాజానికి ప్రభుత్వం మన్నన చూపి ఉండవలసింది అని రాహుల్‌ అన్నారు. ప్రధానిగా సింగ్‌ హయాంలో భారత్‌ ఆర్థిక అగ్ర రాజ్యం అయిందని, ఆయన విధానాలకు ఇప్పటికీ దేశంలోని నిరుపేదలు, వెనుకబడిన తరగతుల మద్దతు లభిస్తోందని రాహుల్‌ గుర్తు చేశారు. కాగా, కాంగ్రెస్‌ లోక్‌సభ విప్‌ మాణిక్కం ఠాగూర్‌ 2016లో మాజీ ప్రధాని ఎబి వాజ్‌పేయి అంత్యక్రియల ఫుటేజ్‌ను పంచుకుంటూ, ’ఆ విధంగా ప్రవర్తించడం ఎంతో బాధిస్తోంది’ అని అన్నారు. ప్రజల ఒత్తిడితోనే బిజెపి ప్రభుత్వం భవిష్యత్తులో ఒక స్మారకచిహ్నం నిర్మించాలనే ఆలోచన ఉన్నట్లు ప్రకటించిందని రాజస్థాన్‌ మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ ఆరోపించారు.