పోలీస్ స్టేషన్ ముందే ఉరేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య
మెదక్ (కొల్చారం, జనంసాక్షి) : మెదక్ జిల్లాలోని కొల్చారం పోలీస్ స్టేషన్ ముందటనే ఉన్న ఎస్సై పాత క్వార్టర్ ఆవరణలో చెట్టుకు ఉరి వేసుకుని కొల్చారం పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న సాయి కుమార్ ఆదివారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలిసిన వెంటనే మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్ రెడ్డి సంఘటనాస్థలికొచ్చి మృతదేహాన్ని మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించి విచారణ ప్రారంభించారు. కామారెడ్డి జిల్లాలో ఒక ఎస్సైతో పాటు మహిళా కానిస్టేబుల్, ప్రైవేటు కంప్యూటర్ ఆపరేటర్ (ముగ్గురు పోలీసుల ) ఆత్మహత్యల ఘటన మరువకముందే మరో చోట మెదక్ జిల్లాలోని కొల్చారం హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనపై పోలీస్ శాఖ సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే మెదక్ జిల్లాలోని కొల్చారం పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న సాయికుమార్ ఆదివారం తెల్లవారుజామున కొల్చారం పోలీస్ స్టేషన్ ముందు భాగంలో ఎస్సై క్వార్టర్ పక్కన చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయికుమార్ రెండు సంవత్సరాల క్రితం జరిగిన బదిలీలలో కొల్చారం పోలీస్ స్టేషన్కు హెడ్ కానిస్టేబుల్ గా వచ్చాడు. గుంటూరు జిల్లాకు చెందిన సాయికుమార్ కు సంగారెడ్డి జిల్లా జోగిపేటకు చెందిన శైలజ వివాహం జరగడంతో జిల్లాలోని నర్సాపూర్ ప్రాంతంలో సుదీర్ఘ కాలం పనిచేయడంతో నర్సాపూర్ పట్టణంలో ఇల్లు నిర్మించుకొని గత కొన్ని సంవత్సరాలుగా నర్సాపూర్లో నివసిస్తున్నాడు. నర్సాపూర్ పట్టణానికి వివాహిత మహిళతో గత కొన్ని రోజులుగా సాయికుమార్ వివాహేతర సంబంధం పెట్టుకోగా, మహిళ భర్త సాయికుమార్ ను డబ్బుల కోసం వేధింపులకు గురి చేస్తున్నాడు డబ్బులు ఇవ్వకుంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని బెదిరింపులకు గురిచేస్తుండడంతో ఆందోళనకు గురైన సాయికుమార్ గత కొన్ని రోజులుగా తన చావు అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతోందని అంటున్నాడంటూ… కుటుంబ సభ్యులు తమ తండ్రి ఆత్మహత్యకు పాల్పడుతాను అంటూ…. ఇంట్లో చెప్పాడని పోలీసులకు, కొల్చారం ఎస్ఐ మహమ్మద్ గౌస్ కు సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్ఐ గౌస్ సాయికుమార్ తో రెండు రోజుల క్రితం మాట్లాడారు. రెండు రోజుల్లో తానే సమస్యను పరిష్కరించు కుంటానని తెలపడంతో ఈ విషయం ఎస్సై, హెడ్ కానిస్టేబుల్ కుటుంబ సభ్యులకు తెలిపారు. కాగా శనివారం రాత్రి విధులకు వచ్చిన సాయికుమార్ ఆదివారం తెల్లవారుజామున స్టేషన్ ముందున్న పాడుబడిన ఎస్సై క్వార్టర్ పక్కనే ఉన్న చెట్టుకు ఊరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలిసిన వెంటనే మెదక్ రూరల్ సి ఐ రాజశేఖర్ రెడ్డి కొల్చారం పోలీస్ స్టేషన్ కు చేరుకొని మృతదేహాన్ని మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీస్ శాఖలో వరుస ఆత్మహత్యలను సవాల్గా తీసుకున్న పోలీసులు విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.