అధికారలాంఛనాలతో నేడు మన్మోహన్‌ అంత్యక్రియలు

` వారంరోజులు సంతాపదినాలు ప్రకటించిన కేంద్రం
` మాజీప్రధానికి ప్రముఖుల రాష్ట్రపతి ముర్ము..
` ప్రధాని మోడీ, అమిత్‌షా తదితరుల శ్రద్దాంజలి
` నివాళులర్పించిన సోనియా, రాహుల్‌, ఖర్గే
` ప్రధాన కార్యాలయాలపై జాతీయజెండా అవనతం
` నేడు ఎఐసిసి కార్యాలయానికి పార్థివదేహం
న్యూఢల్లీి,డిసెంబర్‌27(జనంసాక్షి): భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మన్మోహన్‌ సింగ్‌ పార్థివదేహానికి ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్‌ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా తదితర ప్రముఖులు నివాళులర్పించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మన్మోహన్‌ సింగ్‌ మృతిపై రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కన్నుమూయడంతో దేశ ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన పార్థివదేహానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరంద్రమోదీ నివాళులర్పించారు. శుక్రవారం ఉదయం మన్మోహన్‌ నివాసానికి వెళ్లిన వీరు.. ఆయన భౌతికకాయం వద్ద అంజలి ఘటించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘ఆర్థికవేత్తగా, సంస్కరణల సారథిగా మన్మోహన్‌ సింగ్‌ను దేశం గుర్తుంచుకుంటుంది. ఆర్‌బీఐ గవర్నర్‌ సహా అనేక కీలక పదవుల్లో దేశానికి సేవలందించారు. పీవీ హయాంలో ఆర్థికమంత్రిగా దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చివేశారు. దేశం, ప్రజల పట్ల ఆయన సేవాభావం స్మరించుకోదగినది. విలక్షణ పార్లమెంటేరియన్‌గా ఆయన సేవలు అందించారు. ఎన్నో కీలక పదవులు చేపట్టినా నిరాడంబర జీవితం గడిపారు. జాతీయ, అంతర్జాతీయ అంశాలపై ఆయనతో చాలాసార్లు మాట్లాడా. ఆయన మృతి విచారకరం. నా తరఫున, దేశ ప్రజల తరఫున శ్రద్దాంజలి ఘటిస్తున్నా‘ అని మోదీ తెలిపారు. అంత్యక్రియలను పూర్తి అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినేట్‌ అత్యవసరంగా సమావేశమై ఘనంగా నివాళి అర్పించింది. వారంపాటు సంతాపదినాలు ప్రకటించింది. మన్మోహన్‌ మృతికి సంతాప సూచకంగా కేంద్ర ప్రభుత్వం 7 రోజులు సంతాప దినాలను ప్రకటించింది. రాష్ట్రపతి భవన్‌ సహా అన్ని ప్రభుత్వ భవనాలపై జాతీయ పతాకాన్ని సగానికి అవనతం చేశారు. అటు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంపైనా జాతీయజెండాను సగానికి దించారు. కాంగ్రెస్‌ పార్టీ కూడా వచ్చే ఏడు రోజుల పాటు కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుంది.92 ఏళ్ల మన్మోహన్‌ సింగ్‌ వయసురీత్యా తలెత్తిన అనారోగ్య సమస్యలతో గత రాత్రి ఇంటివద్ద అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారు. దీంతో కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మన్మోహన్‌ పదేళ్ల పాటు దేశానికి ప్రధానిగా సేవలందించారు. అంతకుముందు ఆర్‌బీఐ గవర్నర్‌గా వ్యవహరించారు. ప్రధానిగా పీవీ నరసింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. మన్మోహన్‌ సింగ్‌ అంత్యక్రియలను పూర్తి అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు ఇప్పటికే కేంద్రం వెల్లడిరచింది. ఆయన మృతికి సంతాప సూచికంగా 7 రోజులు సంతాప దినాలను ప్రకటించింది. ప్రజల సందర్శనార్థం శనివారం ఆయన భౌతికకాయాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తీసుకురానున్నారు. శనివారం రాజ్‌ఘాట్‌ సవిూపంలో ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడిరచాయి.
నేడు ఎఐసిసి కార్యాలయానికి పార్థివదేహం
భారత మాజీ ప్రధానమంత్రి, దేశ ఆర్థిక సంస్కరణల రూపకర్త మన్మోహన్‌ సింగ్‌ (92) పార్థివ దేహానికి కాంగ్రెస్‌ అగ్ర నాయకులు సోనియా గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ నివాళులు అర్పించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ ‘మన్మోహన్‌ సింగ్‌ ప్రధానమంత్రిగా అపారమైన జ్ఞానం, సమగ్రతతో భారతదేశాన్ని అభివృద్ధి వైపు నడిపించారు. ఆయనలోని వినయం, ఆర్థికశాస్త్రంపై ఆయనకున్న లోతైన అవగాహన దేశానికి స్ఫూర్తినిచ్చాయి. నా జీవితంలో ఎంతో ముఖ్యమైన ఓ గురువును కోల్పోయాను‘ అని అన్నారు. ప్రియాంకా గాంధీ వాద్రా, ఆమె భర్త రాబర్ట్‌ వాద్రా సైతం మన్మోహన్‌ నివాసానికి చేరుకున్నారు. రాబర్ట్‌ వాద్రా మాట్లాడుతూ.. మన్మోహన్‌ ఎల్లప్పుడూ ప్రజల గురించే ఆలోచిస్తూ దేశ అభివృద్ధికి కృషి చేసేవారని పేర్కొన్నారు. ఆర్థిక విషయాలపై ఆయనకు చాలా జ్ఞానం ఉందని అన్నారు. మన్మోహన్‌ సింగ్‌ యూపీఏ హయాంలో 2004 నుంచి 2014 వరకు భారత ప్రధానిగా పని చేశారు. కాంగ్రెస్‌ పార్టీతో, గాంధీ కుటుంబంతో మన్మోహన్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. గురువారం రాత్రి ఆయన మరణవార్త తెలియడంతో కర్ణాటకలోని బెళగావిలో జరుగుతున్న సీడబ్ల్యూసీ సమావేశాలను అర్ధంతరంగా ముగించి.. మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ వెంటనే దిల్లీకి బయలుదేరారు. దిల్లీలోనే ఉన్న సోనియా, ప్రియాంక ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు.శనివారం ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ వెల్లడిరచారు. దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మన్మోహన్‌ పార్థివ దేహాన్ని ఆయన నివాసంలో ఉంచారు. ప్రజల సందర్శనార్థం శనివారం ఆయన భౌతికకాయాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తీసుకురానున్నారు. రాజ్‌ఘాట్‌ సవిూపంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడిరచాయి.
మన్మోహన్‌ సింగ్‌ అంత్యక్రియలపై కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అంత్యక్రియలు శనివారం అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. దిల్లీలోని నిగమ్‌బోధ్‌ ఘాట్‌లో శనివారం ఉదయం 11.45గంటలకు ఆయన అంతిమ సంస్కారాలు జరుగుతాయని కేంద్ర హోంశాఖ వెల్లడిరచింది.సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు పలికేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కేంద్ర రక్షణ శాఖను కోరినట్లు ఓ ప్రకటనలో పేర్కొంది.
స్మారక స్థలం నిర్మాణం కోసం ప్రధానికి ఖర్గే లేఖ..
మరోవైపు, మన్మోహన్‌ సింగ్‌కు అంత్యక్రియలు నిర్వహించే ప్రదేశంలో స్మారక స్థలం నిర్మించాలని కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. దేశానికి రెండుసార్లు ప్రధానిగా సేవలందించిన మన్మోహన్‌ సింగ్‌కు స్మారక స్థలం ఏర్పాటుపై ఉదయం ప్రధానితో ఫోన్‌లో మాట్లాడిన ఖర్గే.. తాజాగా ఈ అంశంపై ఆయనకు రెండు పేజీల లేఖ రాశారు. రాజనీతిజ్ఞులు, మాజీ ప్రధానమంత్రులకు అంత్యక్రియలు జరిగిన స్థలంలోనే వారి స్మారకాలను నిర్మించిన సంప్రదాయాన్ని గుర్తు చేశారు. దేశ ప్రజల హృదయాల్లో మన్మోహన్‌ సింగ్‌ అత్యంత గౌరవనీయమైన స్థానాన్ని కలిగి ఉన్నారని, ఆయన సేవలు, సాధించిన విజయాలు అపూర్వమైనవన్నారు.దిల్లీలోని మోతీలాల్‌ నెహ్రూ రోడ్డులో మన్మోహన్‌సింగ్‌ నివాసంలోనే ఆయన పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. శనివారం ఉదయం 8 గంటలకు అక్కడి నుంచి ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తరలిస్తారు. కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, అభిమానుల సందర్శనార్థం ఉదయం 8.30గంటల నుంచి 9.30గంటల వరకు అక్కడే ఉంచుతారు. అనంతరం అక్కడి నుంచి అంతిమయాత్ర మొదలవుతుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ తెలిపారు.

దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయింది:సీఎం రేవంత్‌రెడ్డి
` మన్మోహన్‌ సింగ్‌ పార్థివదేహానికి నివాళులర్పించిన తెలంగాణ ముఖ్యమంత్రి
` మన్మోహన్‌ మృతికి తెలంగాణ కాంగ్రెస్‌ సంతాపం
` వారంపాటు రాజకీయకార్యకలాపలకు దూరం
` టీపిసిసి చీఫ్‌ మహేశ్‌ గౌడ్‌ వెల్లడి
న్యూఢల్లీి(జనంసాక్షి):మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ పార్థివదేహానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాళులర్పించారు. బెళగావి నుంచి నేరుగా దిల్లీ వెళ్లిన సీఎం అక్కడి నుంచి మన్మోహన్‌ నివాసానికి వెళ్లి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన వెంట కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షీ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌, మంత్రి దామోదర రాజనర్సింహ, పలువురు ఎంపీలు, కాంగ్రెస్‌ నేతలు ఉన్నారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ గొప్ప ఆర్ధిక వేత్త, మహా నాయకుడు, సంస్కరణ వాది అని అన్నింటికి మించి గొప్ప మానవతావాది అని పేర్కొన్నారు.మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ మృతితో దేశం ఒక గొప్ప కుమారుడిని కోల్పోయిందని సీఎం అవేదన వ్యక్తం చేశారు. మాజీ ప్రధానమంత్రి మృతికి తన సంతాపాన్ని, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని సీఎం తెలియజేశారు.. నిర్ణయాల తీసుకోవడంలో సమగ్రత, పారదర్శకత అన్నింటికీ మించి మానవీయ స్పర్శను జోడిరచేవారని, నవ భారత శిల్పుల్లో మన్మోహన్‌ సింగ్‌ ఒకరని సీఎం రేవంత్‌ రెడ్డి కొనియాడారు..రాజకీయ, ప్రజా జీవితంలో గౌరవ మర్యాదలు ఎలా పాటించాలో ఆయన తన ప్రవర్తన ద్వారా చూపించారని సీఎం పేర్కొన్నారు.
వారంపాటు రాజకీయకార్యకలాపలకు దూరం:పిసిసి చీఫ్‌ మహేశ్‌ గౌడ్‌ వెల్లడి
మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ మృతితో వారం రోజుల పాటు సంతాప దినాలుగా కాంగ్రెస్‌ ప్రకటించింది. ఇప్పటికే రాష్ట్రంలో ప్రభుత్వం కార్యాలయాలకు, విద్యాసంస్థలకు శుక్రవారం సెలవును ప్రకటించారు. నేటి కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలతో పాటు జనవరి 3వ తేదీ వరకు అన్ని రాజకీయ కార్యక్రమాలు రద్దు చేస్తున్నట్లు టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ తెలిపారు. మన్మోహన్‌ సింగ్‌ మృతికి ఆయన సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందని పేర్కొన్నారు. మన్మోహన్‌ సింగ్‌ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే దేశంలో అనేక ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారన్నారు. డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ సద్గుణం, నిష్కళంకమైన చిత్తశుద్ధి ఉన్న వ్యక్తి అని అన్నారు. నవ భారతదేశానికి నిజమైన వాస్తుశిల్పిలలో డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ ఒకరని అన్నారు. భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మరణం వార్త తనను తీవ్ర దిగ్భాంª`రతికి గురిచేసినట్లు తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. దేశాన్ని తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల నుంచి గ్టటెక్కించిన మహా ఆర్థిక మేధావిగా ఆయన్ను కొనియాడారు. కేంద్ర ఆర్థిక మంత్రిగా మన్మోహన్‌ చేసిన సేవలు దేశం ఎన్నటికీ మరిచిపోదన్నారు. నిజాయితీ, మంచితనం, సమర్థవంతంగా పని చేయడంలాంటివి మన్మోహన్‌ సింగ్‌ ను చూసి నేర్చుకోవాలన్నారు.

 

మన్మోహన్‌ కేబినెట్‌లో పనిచేయడం మా అదృష్టం
` తెలంగాణతో ఆయనది ప్రత్యేక అనుబంధం
` రాష్ట్ర ఏర్పాటుకు సహకరించారు: కేసీఆర్‌
హైదరాబాద్‌(జనంసాక్షి): మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ అంత్యక్రియలకు భారత రాష్ట్ర సమితి నేతలు హాజరు కానున్నారు. భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌, పార్టీ ఎంపీలు, ప్రతినిధులు నివాళులర్పించనున్నారు. మన్మోహన్‌ సింగ్‌ అంత్యక్రియలకు హాజరు కావాలని కేటీఆర్‌, ఎంపీలను ఆ పార్టీ అధినేత ఆదేశించారు. ఆర్థిక సంస్కరణల ఆర్కిటెక్టుగా మన్మోహన్‌ సింగ్‌ దేశానికి అమోఘమైన సేవలందించారన్నారు. ఆయనతో తెలంగాణకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి రాష్ట్ర ఏర్పాటు వరకు మన్మోహన్‌ అందించిన సహకారం తెలంగాణ సమాజం ఎప్పటికీ మర్చిపోదు. తెలంగాణ కోసం పోరాడిన సమయంలో ప్రతి సందర్భంలో మనోధైర్యాన్ని నింపుతూ అండగా నిలిచారు. మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా ఉన్న సమయంలోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు జరిగింది. రాష్ట్ర ఏర్పాటులో సానుకూల వైఖరితో ఆయన అందించిన సహకారం మరువలేనది. తెలంగాణ సమాజానికి అత్యంత ఆప్తుడైన మన్మోహన్‌కు భారాస తరఫున ఘన నివాళులు‘ అని కేసీఆర్‌ పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆదేశాల మేరకు మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు బీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు ఢల్లీికి బయల్దేరారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, రాజ్యసభ ఎంపీలు, పలువురు నాయకులు శుక్రవారం సాయంత్రం ఢల్లీికి బయల్దేరి వెళ్లారు. ఆర్థిక సంస్కరణల పితామహుడు మన్మోహన్‌ సింగ్‌కు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆధ్వర్యంలోని పార్టీ ఎంపీలు, నాయకుల బృందం ఘన నివాళులర్పించనుంది. అంత్యక్రియల్లో పాల్గొని మన్మోహన్‌ సింగ్‌కు బీఆర్‌ఎస్‌ నేతలు ఘనంగా వీడ్కోలు పలకనున్నారు. దేశ ఆర్థిక సంస్కరణల ఆర్కిటెక్ట్‌గా మన్మోహన్‌ సింగ్‌ దేశానికి అమోఘమైన సేవలందించారని కేసీఆర్‌ పేర్కొన్నారు. దాంతో పాటు తెలంగాణకు ప్రత్యేకమైన అనుబంధం మన్మోహన్‌ సింగ్‌తో ఉంది. వారి కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన నాకు వారితో వ్యక్తిగత అనుబంధముంది. వారెంతో స్థితప్రజ్ఞత కలిగిన దార్శనికులు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి రాష్ట్ర ఏర్పాటు దాకా వారందించిన సహకారం తెలంగాణ సమాజం మరువదు. తెలంగాణ కోసం పోరాడుతున్న నాకు, టీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రతి సందర్భంలో మనోధైర్యాన్ని నింపుతూ వారు అండగా నిలిచారు. వారు ప్రధానిగా ఉన్న సమయంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందని కేసీఆర్‌ గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర ఏర్పాటులో సానుకూల వైఖరితో నాకు వారందించిన సహకారం మరువలేను. ఈ నేపథ్యంలో తెలంగాణ సమాజానికి అత్యంత ఆప్తుడైన మన్మోహన్‌ సింగ్‌కు ఘన నివాళులు అర్పించాలని బీఆర్‌ఎస్‌ పార్టీ నిర్ణయించింది. వారి కడసారి వీడ్కోలు సందర్భంగా అంత్యక్రియల్లో పాల్గొనాలని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ను, ఎంపీలను ఆదేశించాను. ఈ మేరకు వారు హాజరుకానున్నారు అని కేసీఆర్‌ తెలిపారు.

మన్మోహన్‌తో మాది విడదీయరాని బంధం
` ఇరుదేశాల బంధం బలోపేతానికి ఎంతో కృషి చేశారు
` మాజీ ప్రధానికి అగ్రరాజ్యం అమెరికా నివాళి
వాషింగ్టన్‌(జనంసాక్షి): ప్రముఖ ఆర్థికవేత్త, భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మృతిపట్ల అగ్రరాజ్యం అమెరికా సంతాపం వ్యక్తం చేసింది. యూఎస్‌-భారత్‌ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం చేయడంలో మన్మోహన్‌ సింగ్‌ గ్రేట్‌ ఛాంపియన్‌ అని కొనియాడిరది. ఈ మేరకు యునైటెడ్‌ స్టేట్స్‌ సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ ఆంటోనీ బ్లింకెన్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. గత రెండు దశాబ్దాలలో భారత్‌, అమెరికా మధ్య అధునాతన సంబంధానికి పునాది వేయడంలో డాక్టర్‌ సింగ్‌ సహకారాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ’మాజీ ప్రధానమంత్రి డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ మరణించినందుకు భారతదేశ ప్రజలకు యునైటెడ్‌ స్టేట్స్‌ హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తోంది. యూఎస్‌–భారత్‌ వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపర్చిన వారిలో మన్మోహన్‌ సింగ్‌ ఒకరు. భారత దేశ అభివృద్ధికి ఆయన గొప్ప పునాదులు వేశారు. యుఎస్‌-ఇండియా పౌర అణు సహకార ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మన్మోహన్‌ సింగ్‌ కీలకంగా వ్యవహరించారు. ఈ ఒప్పందం భారత్‌ అమెరికాల మధ్య బంధాన్ని మరింత దృఢంగా చేసింది. ఆర్థిక సంస్కరణలతో భారత వేగవంతమైన ఆర్థిక వృద్ధికి దోహదపడిన మన్మోహన్‌ సింగ్‌ ఎప్పటికి గుర్తు ఉండిపోతారు. ఇండియా, యునైటెడ్‌ స్టేట్స్‌ మధ్య సంబంధాలను బలోపేతం చేయడం కోసం కృషి చేసిన మన్మోహన్‌ సింగ్‌ అంకితభావాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాం’ అని పేర్కొన్నారు. సరికొత్త ఆర్థిక సంస్కరణలతో దేశానికి దిశ, దశ చూపిన ప్రధానిగా మన్మోహన్‌ సింగ్‌ను ఈ చరిత్ర ఎన్నటికీ గుర్తుంచుకుంటుంది. ఇక, ఆయన హయాంలో అమెరికాతో జరిగిన అణుఒప్పందం పెను సంచలనమే..! కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ సహా సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత వచ్చినా దానిపై ఆయన (ఓజీనిపనీఠజీని ªూతినిణఠ) ధైర్యంగా ముందుకెళ్లారు. తన మైనార్టీ ప్రభుత్వానికి వామపక్షాలు మద్దతు ఉపసంహరించుకొని హెచ్చరికలు జారీ చేసినా వెరవకుండా 2008లో అగ్రరాజ్యంతో అణుఒప్పందం చేసుకున్నారు. అందుకేనేమో.. నాటి అమెరికా అధ్యక్షుడు ఒబామా కు ఈయనంటే ప్రత్యేక అభిమానం. ఈ ఒప్పందం కుదిరిన రెండేళ్ల తర్వాత కెనడాలోని టొరంటో వేదికగా జీ20 సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఒబామా మాట్లాడుతూ మన్మోహన్‌పై ప్రశంసలు కురిపించారు. ‘ప్రధాని చెబితే ప్రజలు తప్పకుండా వింటారనే మాటను విూరు నిజం చేశారని ఈ వేదికపై నుంచి నేను బలంగా చెబుతున్నా‘ అని ప్రశంసించారు. ఆ తర్వాత తాను రాసిన ’ఎ ప్రామిస్డ్‌ ల్యాండ్‌’ పుస్తకంలోనూ మన్మోహన్‌ గురించి ఒబామా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన అసాధారణ ప్రతిభ కలిగిన నిజాయతీపరుడు అని అభివర్ణించారు. భారత ప్రజల శ్రేయస్సు, ఆర్థిక సంస్కరణల కోసం ఆయన నిబద్ధతతో పనిచేశారని ప్రశంసించారు. తన సంస్కరణ లతో ఎంతోమందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చారన్నారు. తెలివైన, ఆలోచనాత్మక మైన, కపటం లేని నిజాయతీతో కూడిన వ్యక్తిత్వం మన్మోహన్‌ సొంతమని కొనియాడారు. 1998లో భారత్‌ పోఖ్రాన్‌ 2 అణుపరీక్షలు నిర్వహించింది. దీనిపై అప్పట్లో అగ్రరాజ్యం ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ క్రమంలోనే అంతర్జాతీయ అటామిక్‌ ఎనర్జీ ఏజెన్సీ మనపై పాక్షిక ఆంక్షలు విధించింది. అయితే, అమెరికాతో మన్మోహన్‌ చేసుకున్న అణుఒప్పందం తర్వాత భారత్‌పై ఉన్న ఈ ఆంక్షలు తొలగిపోయాయి.