తెలంగాణ సర్కారు మరో కీలక నిర్ణయం

హైదరాబాద్‌ (జనంసాక్షి) : ఇటీవల సావిత్రి బాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా జరిపేందుకు నిర్ణయించిన తెలంగాణ సర్కారు మరో కీలక ఆదేశాలు జారీచేసింది. భారతదేశ మొదటి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు, విద్యావేత్త, సంఘ సంస్కర్త ఫాతీమా షేక్‌ జయంతిని అధికారికంగా నిర్వహించాలని ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్స్‌ స్కూల్స్‌, జూనియర్‌ కాలేజీల్లో జనవరి 9 (నేడు) పురస్కరించుకుని ఫాతీమా జయంతిని నిర్వహించాలని సూచించింది. సావిత్రి బాయి, జ్యోతిరావు బాపూలేలతో కలిసి పనిచేసిన ఆమె దేశ తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు. ఎన్నో అవమానాలు, నిర్బంధాలు ఎదుర్కొన్నప్పటికీ బాలికల విద్య కోసం పాటుపడ్డారు. సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు సొంతంగా పాఠశాలలు నిర్వహించి అమ్మాయిలకు చదువును దగ్గర చేయడంలో కీలక భూమిక పోషించారు. ఆమె సేవలను కొనియాడుతూ నేడు అన్ని పాఠశాలల్లో ఆమె జయంతి నిర్వహించి ఘన నివాళులర్పించాలని అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.