అన్ని విద్యాలయాలకు ఒకే రంగు


భువనేశ్వర్‌,ఆగస్ట్‌19(జనం సాక్షి): ప్రాథమిక విద్యాశాఖ పరిధిలోని అన్ని పాఠశాలలకు ఒకే రంగు వేసే పనులు సాగుతున్నాయి. విద్యాలయాల పాలనా బాధ్యతలన్నీ మహిళా స్వయం సహాయక సంఘాలకు (ఎస్‌హెచ్‌జీ) అప్పగించాలని నిర్ణయమైంది. మంగళవారం రాత్రి విద్యాశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి సత్యబ్రత సాహు అద్యక్షతన భువనేశ్వర్‌లోని లోక్‌సేవా భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం ఏర్పాటైంది. మధ్యాహ్న భోజనం, పాఠశాలల్లో పారిశుద్ధ్యం, తోటల నిర్వహణ తదితర బాధ్యతలన్నీ ప్రాథమికంగా 15 వేల ఎస్‌హెచ్‌జీలకు కేటాయించాలని నిర్ణయించారు. 1,123 ఉన్నత పాఠశాలల గదులను స్మార్ట్‌ తరగతి గదులుగా చేయాలని, ఈ-గ్రంథాలయాలు, ల్యాబొరేటరీ సౌకర్యాలు కల్పించాలని తీర్మానించారు. మోస్కూల్‌ కార్యక్రమంలో 32,447 పాఠశాలల అభివృద్ధి ధ్యేయంగా పెట్టుకున్నామని, త్వరలో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ అవుతాయని సమావేశానంతరం సాహు విలేకరులకు చెప్పారు. ఆయా జిల్లాల విద్యాధికారులు తరచూ ప్లస్‌టు కళాశాలలు, ప్రాథమికోన్నత పాఠశాలలను సందర్శించి ఇబ్బందులు పరిశీలించి ప్రభుత్వానికి నివేదికలు సమర్పిస్తారన్నారు.