అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌ను తగలబెట్టిన తాలిబన్లు


కాబూల్‌,ఆగస్ట్‌18(జనంసాక్షి): ఆఫ్ఘనిస్థాన్‌ రాజధాని కాబూల్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు తమ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల ఐస్‌క్రీమ్‌లు తింటూ, అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌లో ఆటలాడుతూ, జిమ్‌లో కసరత్తులు చేస్తూ ఎంతో ఉల్లాసంగా గడిపిన తాలిబన్లు తమ వికృత రూపాన్ని ప్రదర్శించారు. అలాంటి మరో అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌ను తగలబెట్టారు. షెబెర్‌ఘన్‌ ప్రావిన్స్‌ బేఘాలోని బోఖ్ది అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌కు రాత్రి వేళ నిప్పుపెట్టి దగ్ధం చేశారు. మరోవైపు ఈ వినోద పార్క్‌ను తగలబెట్టడాన్ని తాలిబన్లు సమర్థించుకున్నారు. అమ్యూజ్‌మెంట్‌ పార్కు లోపలున్న విగ్రహాలు, బొమ్మలు ఇస్లామిక్‌ ఆచారాలకు విరుద్ధంగా ఉన్నాయని చెప్పారు. కాగా, అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌ మంటల్లో కాలిపోతున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.