అయోధ్యలో రామజన్మభూమి రోడ్డుకు కళ్యాణ్‌ పేరు


వెల్లడిరచిన డిప్యూటి సిఎం కేశప్రసాద్‌ మౌర్య
లక్నో,ఆగస్ట్‌23(జనంసాక్షి): అయోధ్య నగరంలో రామ జన్మభూమికి వెళ్లే రహదారికి యూపీ మాజీ ముఖ్యమంత్రి, దివంగత కళ్యాణ్‌ సింగ్‌ పేరు పెట్టనున్నట్లు యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య సోమవారం ప్రకటించారు. అయోధ్యతోపాటు లక్నో, ప్రయాగరాజ్‌, బులంద్‌ షహర్‌, అలీఘడ్‌ నగరాల్లో ఒక్కో రహదారికి కళ్యాణ్‌ సింగ్‌ పేరు పెట్టనున్నట్లు మౌర్యా వెల్లడిరచారు.బీజేపీ సీనియర్‌ నాయకుడు, మాజీ సీఎం కళ్యాణ్‌ సింగ్‌ అనారోగ్యంతో కన్నుమూయడంతో ఆయనకు నివాళిగా పలు రోడ్లకు ఆయన పేరు పెడతామని డిప్యూటీ సీఎం మౌర్యా చెప్పారు. 1991 జూన్‌ నుంచి 1992 డిసెంబరు వరకు, 1997 సెప్టెంబరు నుంచి 1999 నవంబరు వరకు రెండు సార్లు యూపీ సీఎంగా, రాజస్థాన్‌ గవర్నరుగా కళ్యాణ్‌ సింగ్‌ పనిచేశారు. రామాలయ ఆందోళనల్లో భాగస్వామ్యం వహించిన రామ్‌ విలాస్‌ దాస్‌ వేదాంతి బీజేపీ సీనియర్‌ నేత కల్యాణ్‌ సింగ్‌ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్యాణ్‌ సింగ్‌ లాంటి మహా పురుషుడు పునర్జన్మ తీసుకుని భారతమాత గౌరవానికి రక్షణ వహిస్తారని అన్నారు. కల్యాణ్‌ సింగ్‌ కుటుంబంలో ఆయన లాంటి మహనీయుడు జన్మించాలని, అతను సమాజ సేవ చేయాలని శ్రీరాముణ్ణి వేడుకుంటున్నట్లు తెలిపారు. రామ్‌ విలాస్‌ దాస్‌ వేదాంతి.. కల్యాణ్‌ సింగ్‌లు ఎంతో
సన్నిహితంగా మెలిగేవారు. రామ్‌ విలాస్‌ దాస్‌ కూడా రామజన్మభూమి ఆందోళనల అనంతరం బీజేపీ టిక్కెట్‌పై పోటీ చేసి ఎంపీగా గెలిచారు.