అసలు అతడికి మాతో ఏం పని?

కోచ్ గౌతమ్ గంభీర్ గట్టి కౌంటర్

టీమిండియాకు ఆస్ట్రేలియా చేతిలో ఓటమి తప్పదని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఫాంలో లేరని వ్యాఖ్యానించిన పాంటింగ్ చేసిన వ్యాఖ్యలకు భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. భారత క్రికెట్‌తో పాంటింగ్‌కు ఏం పని? అతను ఆస్ట్రేలియా జట్టు గురించి చూసుకుంటే బాగుంటుందని హితవు పలికాడు. ఈరోజు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఆస్ట్రేలియాలో ఎన్నోసార్లు ఆడిన అనుభవం ఉందని, ఇది తమకు ఉపయోగపడుతుందని తెలిపాడు. కుర్రాళ్లకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని ధైర్యం చెప్పాడు. ఆస్ట్రేలియాలో సవాల్‌కు తాము సిద్ధమన్నాడు.

ఆస్ట్రేలియాలో చాలా కఠిన పరిస్థితులు ఉంటాయని తెలిపాడు. సిరీస్‌లో తాము మొదటి నుంచే దూకుడు ప్రదర్శించే ప్రయత్నం చేస్తామన్నాడు. సవాళ్లకు సిద్ధంగా ఉంటామని తెలిపాడు. న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్ తర్వాత రోహిత్‌తో తనకు దూరం పెరిగిందని ప్రచారం జరిగిందని, కానీ తమ ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉందన్నాడు. కివీస్‌తో ఎంతో పోరాడినప్పటికీ అదృష్టం కలిసి రాలేదన్నాడు.

కానీ ఆస్ట్రేలియాలో తమ అనుభవం కీలక పాత్ర పోషిస్తుందన్నాడు. ఆ కారణంగానే కేఎల్ రాహుల్‌ను జట్టులోకి తీసుకున్నట్లు చెప్పాడు. టాప్, మిడిల్ ఆర్డర్‌లో అతను సమర్థవంతంగా బ్యాటింగ్ చేయగలడని, వికెట్ కీపింగ్ చేసే సామర్థ్యమూ ఉందన్నాడు. తొలి టెస్టుకు రోహిత్ శర్మ అందుబాటులో లేకుంటే కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా వస్తాడని చెప్పాడు. కేఎల్ రాహుల్ ఫాంలో లేడని చెబుతున్నారని, కానీ అతను కుదురుకుంటే భారీ ఇన్నింగ్స్ ఆడుతాడన్నాడు.

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల ఫాం గురించి తమకు ఎలాంటి ఆందోళనా లేదన్నాడు. వీరిద్దరు భారత్‌కు ఎన్నో విజయాలు అందించారని గుర్తు చేశాడు. వారిలో ఇప్పటికీ పరుగుల దాహం ఉందన్నాడు. గత ఐదేళ్ల కాలంలో కోహ్లీ రెండు మూడు సెంచరీలు మాత్రమే చేశాడని పాంటింగ్ అంటున్నాడని… కానీ ఆట పట్ల అతనికి నిబద్ధత ఉందన్నాడు. రోహిత్ శర్మకూ అదే నిబద్ధత ఉందన్నాడు.

ఇప్పుడున్న యువ ఆటగాళ్లు తమను తాము నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపాడు. టీమిండియాకు వ్యక్తిగత రికార్డ్స్ అవసరం లేదని… జట్టే ముఖ్యమన్నాడు. జట్టు స్ఫూర్తి అత్యంత కీలకమన్నాడు. తొలి టెస్టుకు రోహిత్ శర్మ అందుబాటులో లేకపోతే… వైస్ కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా జట్టును నడిపిస్తాడని చెప్పాడు. కాగా, నవంబర్ 22న పెర్త్‌లో ఆస్ట్రేలియా-టీమిండియా మధ్య మొదటి టెస్ట్ (బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ) జరగనుంది.