ఇంకెన్నాళ్లు.. ఈ ఘోర ప్రమాదాలు..

మరో ఘోరం.ధూమ శకటం..మరోసారి మృత్యు శకటం అయింది…దేశ రాజధాని నుండి చెన్నై వెళ్తున్న తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో ఘోర అగ్నిప్రమాదం ఎస్‌11 బోగీ శ్మశానంగా మార్చేసింది. చుక్క పొడిచే వేళ ప్రయాణికుల ప్రాణాలను చుక్కల్లో కలిపేసింది. ఈ రైలు ప్రయాణం బతికున్న వారిని మృత్యుగుహ ద్వాంర వద్దకు తీసుకెళ్లి బయటపడేస్తే చనిపోయిన వారి బంధువులను శోక సంద్రంలో ముంచివేసింది. ఇంకో రెండు గంటల్లో తెల్లారుతుందనగా జరిగిన ఈ ప్రమాదంలో 32 మంది ప్రయాణికుల బతుకులు తెల్లారిపోయాయి. తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో సోమవారం తెల్లారుజామున ఘోర అగ్నిప్రమాదం జరిగింది. అసలు గుర్తుపట్టలేని విధంగా 32 మంది అతి దారుణంగా మాడి చనిపోయారు. ఈ ఘటన రైళ్లల్లో ప్రయాణికుల భద్రత గాలిలో దీపమేనన్నది మరోమారు రుజువు చేసింది. సామాన్యుడికి అందుబాటులో ఉన్న ప్రయాణ సాధనంగా ప్రజలు భావించే ప్రయాణికుల భద్రతపై నీలినీడలు కమ్ముకొంటున్నాయి. ప్రయాణికుల భద్రతే తమ మొదటి ప్రాధాన్యమంటూ బడాయి కొట్టే పాలకులు దీనిపై ఎప్పటిలాగే స్పందించారు. మృతి చెందిన వారికి 5 లక్షల నష్టపరిహారం, తీవ్రంగా గాయపడ్డ వారికి లక్ష రూపాయలు ఇస్తామంటూ మీడియాలో ఊదరగొట్టేశారు. ప్రభుత్వం విఫలమయిందంటూ ప్రతిపక్షాలు, సంఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తామని తెలిపారు. నేతల కంటే ఓ మెట్టుపైన ఉన్న రైల్వే అధికారులు దీనికి విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూటే కారణమని తేల్చేశారు. ఇది దేశ ప్రజలకు కొత్త కాదు. ఎపుడు ప్రమాదం జరిగినా ఒకేలా స్పందించే మన నేతలు, అధికారులు ఇపుడు స్పందించారు. హంపీ ఎక్స్‌ప్రెస్‌ దుర్ఘటనలో పారిన రక్తపుటేరులు ఆరక ముందే జరిగిన ఈ ప్రమాదం రైల్వేల్లో భద్రతాలోపానికి పరాకాష్ట. దేశంలోని మీడియా అంతా ఇటే చూస్తుంటే హర్యానాలో ఓ లోకల్‌ ట్రైన్‌ స్కూల్‌ బసును ఢీకొని నలుగురు మృతి చెందారు. ఇంకెన్నాళ్లీ ఘోరాలు..రాజకీయ నిర్లిప్తత, నిర్లక్ష్యానికి ప్రజల ప్రాణాలు గాలిలో కల్సిపోతున్నాయి. భద్రతకు పెద్దపీట వేస్తామన్న నేతల మాటలు నీటిమీది మూటలే అవుతున్నాయి. రైళ్లలో ప్రమాదాలు ముఖ్యంగా సాంకేతిక లోపాలు, మానవ తప్పిదాల వల్లే చోటుచేసుకుంటున్నాయి. ప్రకృతి ప్రకోపించిన సందర్భాలు తక్కువే ఉన్నాయి. షార్ట్‌ సర్క్యూట్‌లు, మానవ తప్పిదాలు వల్లే తరచూ పెద్ద సంఖ్యలో ప్రమాదాలు జరిగి పదుల సంఖ్యలో ప్రాణాలు బలవుతున్నాయి. రైల్వే వ్యవస్థలో మొత్తం దాదాపు లక్షన్నర ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయంటే మన నేతలకు ప్రయాణికుల భద్రతపై ఉన్న శ్రద్ధ కనబడుతుంది. భద్రతా వ్యవస్థకు కేటాయించిన నిధుల్లో కేవలం 45 శాతం కూడా ఖర్చు చేయలేదంటూ కాగ్‌ కడిగేసిందంటే మన ఏలికలకు ప్రజల ప్రాణాలంటే ఎంత విలువో తెలుస్తూంది. రైళ్లు పెంచమని ప్రజాప్రతినిధులు అడిగినప్పుడల్లా పాత, తుప్పు పట్టిన బోగీలను ఉపయోగిస్తూ రైల్వే అధికారులు ప్రజల జీవితాలతో చెలగాటమాడుతోంది. దీనికి నెల్లూరు ఘటనే నిదర్శనం. ప్రమాదం జరిగిన ఎస్‌11 బోగీలో ఘటనా సమయంలో మూడు డోర్లు తెరుచుకోలేదనీ,  కేవలం ఒక్క డోర్‌ మాత్రమే తెరుచుకుందని బాధితులు తెల్పడం రైల్వేల ఘోర పరిస్థితికి కారణం..మానవ తప్పిదాలు, పర్యవేక్షణ లోపం, సాంకేతిక లోపం, భద్రతా వైఫల్యం ఇవన్నీ ప్రజల జీవితాలను ప్రమాదంలోకి నెట్టేవి. ప్రపంచంలోని అతి పెద్ద రైల్వే వ్యవస్థ భారత రైల్వే ఇలాంటి వన్నీ అధిగమించి మరో   పది సంవత్సరాల్లో ప్రమాద రహితమైనవిగా మార్చుతామని చెప్తున్న రైల్వే మంత్రి మాటలు నిజమవ్వాలని ఆశిద్దాం