ఉత్తిత్తి కేసులు ఎత్తేసిండ్రు అసలు కేసులు గట్లనే ఉంచిండ్రు

హైద్రాబాద్‌,జూలై 6(జనంసాక్షి): తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులపై పెట్టిన కేసుల్లో ఎత్తేసినవన్నీ ఉత్తుత్తి కేసులేననీ, అసలు కేసులు అలానే ఉన్నయనీ తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్‌ కోదండరాం అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉత్తుత్తి చిన్నచిన్న కేసులు ఎత్తివేసిందనీ, అయితే నాన్‌బెయిలబుల్‌ కేసులు అలానే ఉన్నాయనీ ఆయన తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకు విద్యార్థులపై కత్తి కట్టిన ప్రభుత్వం వేల సంఖ్యలో కేసులు పెట్టిందనీ, అయితే కేవలం 15కేసుల్లో 984 మంది విద్యార్థులపై పెట్టిన కేసులు మాత్రమే ఉపసంహరించుకొందనీ ఆయన మండిపడ్డారు. నిజానికి ప్రభుత్వం పెట్టినవన్నీ అక్రమ కేసులేననీ, కనుక వాటన్నింటినీ ఎత్తివేయాలని, కేసుల ఉపసంహరణను ప్రభుత్వం వేగవంతం చేయాలని డిమాండ్‌ చేశారు. సర్కార్‌ వేధింపులకు ఈ కేసులే నిదర్శనమన్నారు. ఈ కేసులపై జేఏసీ సమావేశంలో చర్చిస్తామని తెలిపారు. ప్రభుత్వం విద్యార్థులపై పెట్టిన నాన్‌బెయిలబుల్‌ కేసులతో సహా అన్ని కేసులను ఎత్తివేయాల్సిందేనని స్పష్టం చేశారు.