తెలంగాణ అంటేనే త్యాగాల అడ్డా

 

 

 

 

 

సెప్టెంబర్ 17(జనం సాక్షి )! హైద‌రాబాద్ : తెలంగాణ అంటేనే త్యాగాల అడ్డా.. పోరాటాల గ‌డ్డ అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వ నియంతృత్వ పోక‌డ‌ల‌ను ఆనాటి తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో ఎదురిద్దాం. మ‌ళ్లీ కేసీఆర్ నాయ‌క‌త్వంలో తిరిగి తెలంగాణ‌ను సంక్షేమ బాట‌లో తీసుకెళ్దామ‌ని కేటీఆర్ పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 17 జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవ‌న్‌లో కేటీఆర్ జాతీయ జెండాను ఆవిష్క‌రించారు.

ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కొంద‌రు విమోచనం అని, మ‌రికొంత మంది విలీనం అని, ఇంకొంత మంది విద్రోహ‌మ‌ని ర‌క‌ర‌కాలుగా అన‌వ‌చ్చు గాక‌, కానీ తెలంగాణ సాయుధ పోరాటంలో ఆనాడు ల‌క్ష‌లాది మంది పాల్గొని వేలాది మంది అసువులు భాసారు. ఆనాటి రాచ‌రిక వ్య‌వస్థ‌కు వ్య‌తిరేకంగా పోరాడి మ‌న‌కు స్వేచ్ఛా వాయువులు వ‌చ్చాయంటే ఆనాటి అమ‌ర‌వీరుల త్యాగాలు మ‌నంద‌రికి ఆద‌ర్శం. వారంద‌రికి బీఆర్ఎస్ త‌ర‌పున, కేసీఆర్, ప్ర‌తి గులాబీ సైనికుడి త‌ర‌పున వారి అమ‌ర‌త్వానికి శిర‌సు వంచి విన‌మ్రంగా నివాళుల‌ర్పిస్తున్నాం అని కేటీఆర్ పేర్కొన్నారు.

అలాగే తెలంగాణ అంటేనే త్యాగాల అడ్డా.. పోరాటాల గ‌డ్డ‌. సాయుధ పోరాటం నుంచి మొద‌లుపెడితే తొలి ద‌శ తెలంగాణ ఉద్య‌మ‌మైనా, ఆ త‌ర్వాత కేసీఆర్ నాయ‌క‌త్వంలో జ‌రిగిన మ‌లిద‌శ పోరాట‌మైనా, ఇవాళ్టికి కూడా ఈ నియంతృత్వ కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా జ‌రుగుతున్న పోరాట‌మైనా.. వీట‌న్నింటికి బీజం ప‌డ్డ‌ది తెలంగాణ సాయుధ పోరాటంతోనే. ఒక షేక్ బంద‌గీ, దొడ్డి కొముర‌య్య‌, ఆరుట్ల క‌మ‌ల‌మ్మ‌, ఆరుట్ల రామచంద్రారెడ్డి, రావి నారాయ‌ణ‌రెడ్డి లాంటి ఎంతో మంది పెద్ద‌లు ఆనాడు పోరాట స్ఫూర్తితో బండెన‌క బండిక‌ట్టి అని అద్భుత‌మైన క‌విత‌లు రాశారు. ఆ పెద్ద‌ల స్ఫూర్తితో, మ‌రి భ‌విష్య‌త్‌లో కూడా ప్ర‌జాస్వామిక ఉద్య‌మాలు నిర్మిస్తూ తెలంగాణలో తిరిగి సంక్షేమ రాజ్యం రావాల‌ని, రైతు రాజ్యం రావాల‌ని, తెలంగాణ ప్ర‌జ‌లు స్వేచ్ఛ‌గా ఊపిరి పీల్చుకునే, నియంతృత్వ పోక‌డ‌లు లేని ప్ర‌జాస్వామ్య వాతావ‌ర‌ణం రావాల‌ని ఆశ‌యంతో కేసీఆర్ నాయ‌క‌త్వంలో పోరాటం చేస్తూనే ఉంటామ‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

కాంగ్రెస్ ప్ర‌భుత్వ నియంతృత్వ పోక‌డ‌ల‌కు వ్య‌తిరేకంగా మా విద్యార్థి త‌మ్ముళ్లు, చెల్లెళ్లు పోరాడుతున్నారు. ఈ కాంగ్రెస్ ప్ర‌భుత్వం గ్రూప్-1 పోస్టుల భ‌ర్తీలో విఫ‌ల‌మైంది. ఈ క్ర‌మంలో దిక్కుతోచ‌క రౌండ్ టేబుల్ స‌మావేశం పెట్టుకుంటే నియంతృత్వ పోక‌డ‌ల‌తో విద్యార్థుల‌తో అరెస్టు చేస్తున్న దుర్మార్గ‌మైన వ్య‌వ‌స్థ మ‌న క‌ళ్ల ముందున్న‌ది. రైతులు ఇవాళ అల్లాడిపోతుంటే వారిని ప‌ట్టించుకోకుండా ఒలింపిక్స్ గురించి మాట్లాడుకుంటున్న ఒక నీతిమాలిన ప్ర‌భుత్వం మ‌న రాష్ట్రంలో ఉన్న‌ది. ఇలాంటి నియంతృత్వ పోక‌డ‌ల‌ను ఆనాటి తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో ఎదురిద్దాం. కేసీఆర్ నాయ‌క‌త్వంలో తిరిగి తెలంగాణ‌ను సంక్షేమ బాట‌లో తీసుకెళ్దాం అని కేటీఆర్ పిలుపునిచ్చారు.

ఒక‌రు విమోచ‌నం, ఒక‌రు విలీనం, ఒక‌రు విద్రోహం అనొచ్చు.. కానీ రాచ‌రిక వ్య‌వ‌స్థలో నుంచి ప్ర‌జాస్వామిక వ్య‌వ‌స్థ‌లోకి స‌మైక్య‌మైన రోజు కాబ‌ట్టి జాతీయ స‌మైక్య‌తా దినోత్స‌వంగా పాటిస్తున్నాం. గ‌తంలో ప్ర‌భుత్వంలో కూడా ఈ విధంగానే పిలిచాం. ఆ రోజు జెండా ఎగుర‌వేశాం.. ఇవాళ కూడా జెండా ఎగుర‌వేశాం. ఆనాటి పోరాట యోధుల త్యాగాల సాక్షిగా తెలంగాణ బిడ్డలు మరోసారి పోరాటం చేయవలసిన అవసరం ఉన్నది అని కేటీఆర్ గుర్తు చేశారు.