మత మార్పిడి చట్టాలపై పిటీషన్లు..మీ సమాధానం చెప్పండి
` పలు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు 4 వారాల గడువు
న్యూఢల్లీి(జనంసాక్షి)వివిధ రాష్ట్రాలు రూపొందించిన మత మార్పిడి నిరోధక చట్టాలపై స్టే విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హరియాణా, రaారండ్, కర్ణాటక తమ సమాధానాలను తెలియజేయడానికి నాలుగు వారాల గడువును ఇచ్చింది. రాష్ట్రాల ప్రతిస్పందన అందిన తర్వాత మతమార్పిడి నిరోధక చట్టాల అమలును నిలిపివేయాలన్న విజ్ఞప్తులను పరిశీలిస్తామని స్పష్టం చేసింది. పిటిషనర్లను రెండు వారాల తర్వాత రిజాయిండర్లు దాఖలు చేయడానికి అనుమతించింది. మత మార్పిడి చట్టాలపై స్టే విధించాలన్న పిటిషనర్ల అభ్యర్థనను ఆరు వారాల తర్వాత పరిశీలిస్తామని వెల్లడిరచింది. పలు రాష్ట్రాలు రూపొందించిన మత మార్పిడి చట్టాల రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె వినోద్ చంద్రన్ ధర్మాసనం విచారించింది. వివిధ రాష్ట్రాలు రూపొందించిన మత మార్పిడి నిరోధక చట్టాల చట్టబద్ధతను సవాలు చేస్తూ ‘సిటిజన్స్ ఫర్ పీస్ అండ్ జస్టిస్’ అనే స్వచ్ఛంద సంస్థ పిటిషన్ దాఖలు చేసింది. ఈ ఎన్జీఓ తరఫున సీనియర్ న్యాయవాది చందర్ ఉదయ్ సింగ్ సుప్రీంకోర్టు ఎదుట వాదనలు వినిపించారు. ప్రస్తుత మత మార్పిడి నిరోధక చట్టంలో ఉత్తర్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలు మరింత కఠినమైన మార్పులను తీసుకొచ్చాయన్నారు. వాటిని దృష్టిలో ఉంచుకుని మత మార్పిడి నిరోధక చట్టం అమలుపై స్టే విధించాలని కోరారు. ఈ చట్టాలను మత స్వేచ్ఛ చట్టం అని పిలిచినప్పటికీ, అవి మైనారిటీల మత స్వేచ్ఛను హరిస్తున్నాయని తెలిపారు. ఈ చట్టం ప్రకారం మతమార్పిడులకు పాల్పడితే 20 ఏళ్లు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని, దీన్ని జీవిత ఖైదుకు కూడా పెంచవచ్చని అన్నారు. బెయిల్ నిబంధనలు కూడా పీఎంఎల్‌ఏ చట్టంలాగే కఠినంగా ఉన్నాయని కోర్టుకు తెలియజేశారు. అలాగే మతాంతర వివాహం చేసుకున్నవారికి బెయిల్ రావడం కష్టతరమవుతుందని పేర్కొన్నారు.చాలా రాష్ట్రాలు ఇప్పటికే ఇటువంటి చట్టాలను అమలు చేశాయని, ఈ విషయంలో తాజాగా రాజస్థాన్ ఒక చట్టాన్ని ఆమోదించిందని సుప్రీంకోర్టు ఎదుట సింగ్ వాదనలు వినిపించారు. ఉత్తర్?ప్రదేశ్?లో ప్రవేశపెట్టిన సవరణలు ప్రకారం ఎవరైనా వ్యక్తి ఫిర్యాదు చేయవచ్చని, పండగల సమయంలో గుంపులు మత మార్పిడి చేసుకున్న వారిని అడ్డుకుంటున్నాయని స్పష్టం చేశారు. స్పెషల్ లీవ్ పిటిషన్లలో దాఖలు చేసిన సవరణ దరఖాస్తులను అనుమతించాలని ఆయన కోరారు. అలాగే మధ్యప్రదేశ్ ఆమోదించిన మత మార్పిడి నిరోధక చట్టంపై మధ్యంతర స్టే విధించాలని సీనియర్ న్యాయవాది ఇందిరా జై సింగ్ దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ తరపున వాదిస్తున్న న్యాయవాది వృందా గ్రోవర్ కూడా తన క్లయింట్ కూడా ఈ చట్టాలను నిలిపివేయాలని పిటిషన్ దాఖలు చేశారని ధర్మాసనానికి తెలియజేశారు.మత మార్పిడి నిరోధక చట్టాల అమలుపై స్టే విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై ప్రతిస్పందన తెలియజేయాలని రాష్ట్రాల తరఫున వాదిస్తున్న అదనపు సొలిసిటర్ జనరల్ కె.ఎం. నటరాజ్?కు ధర్మాసనం తెలిపింది. మూడు-నాలుగేళ్ల తర్వాత అకస్మాత్తుగా వారు స్టే కోసం దాఖలు చేస్తారని నటరాజ్ పేర్కొన్నారు. తాము ప్రతిస్పందనలు దాఖలు చేస్తామన్నారు. మోసపూరిత మత మార్పిడులపై నిషేధం కోరుతూ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ దాఖలు చేసిన ప్రత్యేక పిటిషన్‌ను కూడా ధర్మాసనం డీ-ట్యాగ్ చేయాలని ఆదేశించింది. ఈ కేసును కమ్యూనికేట్ చేసేందుకు పిటిషనర్ల తరపున న్యాయవాది శ్రుష్టిని, రాష్ట్రాల తరపున న్యాయవాది రుచిరాను నోడల్ న్యాయవాదిగా నియమించింది. మత మార్పిడి నిరోధక చట్టాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 25 లను ఉల్లంఘిస్తున్నాయని ‘సిటిజన్స్ ఫర్ పీస్ అండ్ జస్టిస్’ అనే స్వచ్ఛంద సంస్థ పిటిషన్‌లో పేర్కొంది. ఎందుకంటే ఇవి ఒక పౌరుడి వ్యక్తిగత స్వేచ్ఛ, తనకు నచ్చిన మతాన్ని ఆచరించే స్వేచ్ఛను అణిచివేసే అధికారం రాష్ట్రాలకు కల్పిస్తున్నాయని ఆరోపించింది. ఈ క్రమంలో మతమార్పిడి నిరోధక చట్టాలపై స్టే కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు పలు రాష్ట్రాల స్పందన కోరింది.