మీ సమస్య పరిష్కరించకుంటే స్థానిక ఎన్నికలు బహిష్కరించండి
` నల్గొండ, సూర్యాపేట జిల్లాకు చెందిన ఆర్‌ఆర్‌ఆర్ బాధితులతో కేటీఆర్ భేటి
` హైడ్రా బుల్డోజర్ పేదల ఇళ్లపైకే వెళ్తుందని వెల్లడి
హైదరాబాద్(జనంసాక్షి):నల్గొండ, సూర్యాపేట జిల్లాకు చెందిన ఆర్‌ఆర్‌ఆర్ బాధితులంతా ఐకమత్యంగా ఉండాలని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ సూచించారు.నల్గొండ, సూర్యాపేట జిల్లాల ట్రిపుల్ ఆర్ బాధితులు సోమవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ను కలిసి సమస్యలు విన్నవించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మీ సమస్య పరిష్కరించకపోతే త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు బహిష్కరించాలని సూచించారు. స్థానిక ఎన్నికలు బహిష్కరించడం వల్ల మీ సమస్య దిల్లీకి వెళ్తుంది. అసెంబ్లీలో మాకు మైక్ ఇవ్వట్లేదు. మైక్ ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం భయపడుతోంది. కత్తి వాళ్ల చేతిలో పెట్టారు.. మమ్మల్ని యుద్ధం చేయమంటున్నారు. కాంగ్రెస్ నేతల భూముల్లో రోడ్డు వెళ్లకుండా అలైన్‌మెంట్ మార్చడం కొత్తేంకాదు. గతంలో ఔటర్ రింగ్ రోడ్డు వేసినప్పుడు కూడా అష్ట వంకర్లు తిప్పారు. గతంలో ఓఆర్‌ఆర్‌కు భూసేకరణ సమయంలో భూమికి బదులు భూమి ఇచ్చారు. ట్రిపుల్ ఆర్ వల్ల భూమి కోల్పోతున్న రైతులకు భూమి కావాలంటే పోరాటం చేయొచ్చు. అలైన్‌మెంట్ శాస్త్రీయంగా ఉండాలని ఉద్యమం చేద్దాం’’ అని కేటీఆర్ అన్నారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు జగదీశ్‌రెడ్డి, కర్నె ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
హైడ్రా బుల్డోజర్ పేదల ఇళ్లపైకే వెళ్తుంది.. పెద్దల ఇళ్లకు వెళ్లదు: కేటీఆర్
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇళ్లను కూల్చివేస్తోందని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.సెలవు రోజుల్లో కూల్చివేతలు వద్దని హైకోర్టు స్పష్టంగా చెప్పిందన్నారు. కానీ ఆదివారం సెలవురోజునే గాజులరామారంలో పేదల ఇళ్లు కూల్చారని విమర్శించారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే.. బుల్డోజర్ రాజ్యానికి లైసెన్స్ ఇచ్చినట్లే అని వ్యాఖ్యానించారు. హైడ్రా బుల్డోజర్ పేదల ఇళ్లపైకే వెళ్తుందని.. పెద్దల ఇళ్లకు వెళ్లదన్నారు.‘’భారత రాష్ట్ర సమితి కార్యకర్త సర్దార్ ఇంటిని ప్రభుత్వం కూల్చివేసింది. ఆయనకు మళ్లీ ఇల్లు నిర్మించి ఇచ్చే బాధ్యత నాది. నిన్న మోదీ హెచ్1 బీ వీసా గురించి మాట్లాడతారని ఆశించాం. దాని గురించి మాట్లాడకుండా జీఎస్టీ పండగ అని చెప్పారు. నిన్నటి వరకు రక్తం తాగి.. ఇప్పుడు పండగ చేసుకో అంటున్నారు. జీఎస్టీ పేరు మీద 8 ఏళ్ల పాటు ప్రజల నుంచి ఎంతో భారం వేశారు. మోదీ గతంలో చెప్పినట్లు ప్రజలందరికీ రూ.15 లక్షలు ఇస్తే పండగ చేసుకుంటాం’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.