ఎమ్మెల్యే రామకోటయ్యపై సస్పెన్షన్‌ వేటు

విజయవాడ, జూలై 20 : ఊహించినట్టే జరిగింది. నూజివీడు టిడిపి ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్యపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈ మేరకు శుక్రవారం అధికారిక ప్రకటన వెలువడింది. గురువారం నాడు జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో పార్టీ ఆదేశాలు దిక్కరించి రామకోటయ్య ఓటింగ్‌లో పాల్గొన్నారు. రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని టిడిపి నిర్ణయించగా అందుకు భిన్నంగా రామకోటయ్యతో పాటు ఐదుగురు టిడిపి ఎమ్మెల్యేలు వ్యవహరించారు. దీనిని తీవ్రంగా పరిగణించిన పార్టీ అధిష్ఠానం రామకోటయ్యను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని నిర్ణయించింది. పార్టీ జిల్లా కమిటీ నుంచి కూడా టిడిపి అధిష్ఠానం నివేదిక తెప్పించుకొని రామకోటయ్యపై క్రమశిక్షణ చర్య గైకొన్నది. గత కొంత కాలంగా రామకోటయ్య టిడిపికి దూరంగా ఉండడమే కాకుండా, కాంగ్రెస్‌తో చెట్టపట్టాలేసుకొని తిరుగుతున్నారు. తాజాగా తాను భవిష్యత్తులో సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు పాలడుగు వెంకటరావు సారథ్యంలో పనిచేస్తానని కూడా రామకోటయ్య అన్నారు. పాలడుగు నూజివీడుకు చెందిన నాయకుడు కాగా, కృష్ణాజిల్లాలో సస్పెన్షన్‌ వేటుపడ్డ టిడిపి ఎమ్మెల్యేలో రామకోటయ్య రెండవ వ్యక్తి. గతంలో జగన్మోహన్‌రెడ్డిని కలిసినందుకు గుడివాడ టిడిపి ఎమ్మెల్యే కొడాలి నానిని కూడా పార్టీ నుంచి సస్పెండ్‌ చేయడం తెలిసిందే.