భూదాన్ భూముల రక్షణకు సర్వోదయ మండలి పోరాటం

జాతీయ ట్రస్ట్ ఇన్‌చార్జ్ షేక్ హుస్సేన్

జడ్చర్ల, జూన్ 10 (జనంసాక్షి): ఆక్రమణకు గురవుతున్న భూదాన్ భూములను కాపాడి, అర్హులైన పేదలకు అందజేస్తామని సర్వ సేవా సంఘం జాతీయ ట్రస్ట్ ఇన్‌చార్జ్ షేక్ హుస్సేన్ స్పష్టం చేశారు. జడ్చర్ల అంబేద్కర్ కళాభవనంలో మంగళవారం నాయకులు భాగి కృష్ణయ్య అధ్యక్షతన జరిగిన తెలంగాణ సర్వోదయ మండలి మహబూబ్‌నగర్ జిల్లా మహాసభలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఉన్న రెండు వేల ఎకరాల భూదాన్ భూమిలో, భూత్పూర్ మండలంలోనే 700 ఎకరాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. వీటిని కబ్జాదారుల నుండి విడిపించి పేదలకు పంపిణీ చేసే వరకు తమ మండలి పోరాడుతుందని వెల్లడించారు. యువజన విభాగం జాతీయ అధ్యక్షులు అవినాష్ మాట్లాడుతూ, నూతన కమిటీ భూముల రక్షణలో కీలక పాత్ర పోషించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్వోదయ మండలి రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు శంకర్ నాయక్, గిరిప్రసాద్ మరియు డీహెచ్‌పీఎస్ రాష్ట్ర నాయకులు బాల నరసింహ పాల్గొన్నారు. మహాసభలో భాగంగా జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా జి. సత్యనారాయణ రెడ్డి, కార్యదర్శిగా భాగి కృష్ణయ్య, ఉపాధ్యక్షులుగా ఎండి. కలీం, తెలుగు సత్తయ్య, సహాయ కార్యదర్శిగా సుందర్ రాజ్, కోశాధికారిగా పి. శివకుమార్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శులుగా శ్రీనివాస్ రెడ్డి, సురేష్‌లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జాంగిర్, శ్రీను నాయక్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.