ముఖ్యమంత్రి పర్యటన సాకుతో మహిళా నాయకురాలి అక్రమ అరెస్ట్

యాచారం పోలీసుల తీరుపై కవుల సరస్వతి ఆగ్రహం

యాచారం, జూన్ 10(జనం సాక్షి) ముఖ్యమంత్రి పర్యటన ఉందనే నెపంతో యాచారం పోలీసులు ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా తనను చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేసి, తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని కవుల సరస్వతి ఆరోపించారు. ఈ రోజు ఉదయం 9 గంటలకు ఆమె తన సోదరి, వృద్ధురాలైన తల్లితో కలిసి నందివనపర్తి లోని తమ నివాసం నుండి హైదరాబాద్‌కు బయలుదేరుతుండగా యాచారం పోలీసులు వచ్చి ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. నోటీసు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించగా యాచారం సీఐ నందీశ్వర్ దురుసుగా ప్రవర్తిస్తూ, స్టేషన్‌కు రాకపోతే ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తానని బెదిరించారు. తల్లి కంగారు పడుతుందని చెప్పినా వినకుండా క్యాబ్ డ్రైవర్‌ను దించేసి, కారులో కానిస్టేబుల్‌ను ఎక్కించి బలవంతంగా స్టేషన్‌కు తరలించారని, మధ్యలో తన మొబైల్ ఫోన్‌ను కూడా లాక్కున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ అక్రమ అరెస్ట్ సమాచారం తెలుసుకున్న కమిటీ సభ్యులు ముత్యాల వెంకట్ రెడ్డి, బొడ్డు సందీప్, శ్రీకాంత్ నాయక్ మరియు స్థానిక రైతులు తక్షణమే ఏసీపీ రాజుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఏసీపీ, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన సీఐని మందలించడంతో పోలీసులు ఆమెను వదిలిపెట్టారు. అయితే స్టేషన్ నుండి పంపించినప్పటికీ, చట్టవిరుద్ధంగా ఒక పోలీస్ పెట్రోల్ వ్యాన్‌ను ఆమె వెనుక పంపి నిరంతరం వెంబడిస్తూ తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఒక మహిళా సామాన్య పౌరురాలిపై ఈ రకమైన నిఘా పెట్టడం సరైన పద్ధతి కాదని, తమ హక్కులకు భంగం కలిగించిన పోలీసు అధికారులపై ఉన్నతాధికారులు తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కవుల సరస్వతి డిమాండ్ చేశారు.