భూపాలపల్లి మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతా: ఎమ్మెల్యే జీఎస్ఆర్

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, పట్టణాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు.బుధవారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 2, 15వ వార్డుల సంయుక్త వార్డు సభ ఫకీర్‌గడ్డ, హనుమాన్ టెంపుల్ ప్రాంగణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన తాగునీరు, డ్రైనేజీ, సీసీ రోడ్లు, వీధి దీపాలు, పారిశుద్ధ్య నిర్వహణతో పాటు ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. వార్డు సభల ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామని, ప్రజలు సూచించిన అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం వార్డుల ప్రజల నుంచి వినతులను స్వీకరించి సంబంధిత అధికారులకు పరిష్కారానికి అవసరమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య గౌడ్, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, వార్డు ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.