బొక్కతింటూ.. పుట్టిన గడ్డకు పోటు.. ప్రభువు పాదాల వద్ద లొంగుబాటు

` పరాయిగడ్డపై ‘బక్కని’ ఆత్మవంచన
` గద్దె కోసం గడ్డి తింటారా..!?
` నరసింహులు వ్యాఖ్యలపై మండిపడుతున్న తెలంగాణవాసులు
` తెలుగు భాషకు ప్రాచీన భాష హోదా వచ్చిందే తెలంగాణ నుంచి కదా..!
హైదరాబాద్ (జనంసాక్షి) :
తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు కొందరు చేస్తున్న కుట్రలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవలే ఓ పార్టీ ఎంపీ పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ విభజనను పాకిస్తాన్‌తో పోల్చగా.. తాజాగా మంగళగిరి మహానాడు సాక్షిగా టీటీడీపీ నేత చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి. పరాయివాళ్ల పంచన చేరి చరిత్ర గుర్తెరకుండా పుట్టిన గడ్డను అవమానపరిచేలా ఆత్మవంచనకు పాల్పడటం నిజంగా ఆత్మహత్యా సదృశ్యమే..!!
తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బక్కని నర్సింహులు తెలుగు నాడు వేదికపై చేసిన వ్యాఖ్యలు “తెలంగాణకు చరిత్ర లేదు, డిక్షనరీలో తెలంగాణ పదమే లేదు” అజ్ఞానానికి నిదర్శనం మాత్రమే కాదు, తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే అపహాస్యం. తెలంగాణకు చరిత్ర లేదని అనేవారికి కాకతీయ సామ్రాజ్యం గురించి తెలుసా? వేయి స్తంభాల గుడి, రామప్ప దేవాలయం యునెస్కో గుర్తింపు పొందిన వారసత్వ సంపద తెలంగాణ మట్టిలో పుట్టింది. శాతవాహనులు, చాళుక్యులు, కాకతీయులు, ముసునూరి నాయకులు, బహమనీ సుల్తానులు, కుతుబ్ షాహీలు, నిజాం నవాబులు ఒక్కొక్కరూ తెలంగాణ చరిత్రకు బంగారు పేజీ రాశారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురికియాలలో దొరికిన శిలాశాసనం ద్వారా తెలుగు భాషకు ప్రాచీన భాష హోదా లభించింది. తెలుగు భాషకు గుర్తింపు ఇచ్చిన నేల తెలంగాణది ఇది చరిత్ర కాదా?
సాహిత్యం, పోరాటం.. తెలంగాణ గొప్పతనం
మహాకవి పోతన తెలంగాణ నేలపై పుట్టి భాగవతాన్ని రాశాడు. అది తెలుగు సాహిత్యానికి కిరీటం. కాళోజీ నారాయణరావు తెలంగాణ గొంతుకయ్యారు. సురవరం ప్రతాపరెడ్డి ఆంధ్ర సారస్వత చరిత్ర రాసి తెలుగు వారసత్వాన్ని నిలబెట్టారు. నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా జరిగిన సాయుధ తెలంగాణ రైతాంగ పోరాటం భారత విప్లవ చరిత్రలో మైలురాయి. ఆ త్యాగాల రక్తంతో తడిసిన నేలకు చరిత్ర లేదా?
“మద్రాసిల్లు” అద్దం చూపిస్తే కోపమెందుకు?
1952కి పూర్వం ఆంధ్ర ప్రాంతం మద్రాస్ రెసిడెన్సీలో భాగంగా ఉంది. ‘ఆంధ్ర రాష్ట్రం’ అని పిలవబడే ప్రత్యేక రాష్ట్రం 1953లో ఏర్పడింది. అంతకు ముందు తెలంగాణకు వేల సంవత్సరాల స్వతంత్ర పరిపాలనా చరిత్ర ఉన్నది. ఇప్పుడు చెప్పండి చరిత్ర లేనిది ఎవరికి?
రాజకీయ ప్రయోజనం కోసం..
బక్కని నర్సింహులు చేసిన వ్యాఖ్యలు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మెప్పు కోసం చేసిన వ్యాఖ్యలని స్పష్టంగా కనిపిస్తోంది. రాజకీయ ప్రయోజనం కోసం తెలంగాణ చరిత్రను కించపరచడం తెలంగాణ ప్రజలను అవమానించడమే. ఒక పార్టీ అధ్యక్షుడు నిఘంటువు మొదటి పేజీ తెరవకుండా చేసే వ్యాఖ్యలు ఆ పార్టీ స్థాయిని చెప్పకనే చెబుతాయి. చరిత్రను అబద్ధంగా చెప్పవచ్చు, కానీ చరిత్రను తుడిచిపెట్టలేరు. కాకతీయుల కోటగోడలు, రామప్ప శిల్పాలు, పోతన పద్యాలు, కాళోజీ కవితలు, రైతాంగ పోరాటం ఇవన్నీ జీవంగా ఉన్నాయి. బక్కని వంటివారి మాటలు చరిత్రను మార్చలేవు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని అణగదొక్కలేవు. తెలంగాణ పదం డిక్షనరీలో లేదు అనేవారికి వారి డిక్షనరీయే తప్పు రాసిందని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.