ధరలు తగ్గిస్తారా.. గద్దె దిగుతారా..?
సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు
పెరిగిన ధరలపై సిపిఐ హనుమకొండ కలెక్టరేట్ ముట్టడి
హనుమకొండ ప్రతినిధి జూలై 10 (జనం సాక్షి) : ప్రజలకు భారంగా పరిణమించిన అధిక ధరలను తగ్గిస్తారా.. లేక గద్దె దిగుతారా.. అని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సిపిఐ రాష్ట్ర వ్యాప్తం పిలుపులో భాగంగా ఆధిక ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ బుధవారం హనుమకొండ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. సిపిఐ హనుమకొండ జిల్లా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తొలుత ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియం నుండి కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన ధర్నాకు ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇప్పటికే పెట్రోల్ డీజిల్ ధరలను భారీగా పెంచిన ప్రభుత్వం తాజాగా వంట గ్యాస్ ధరలను పెంచి పేదలపై భారం మోపిందని అన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు తోడు నిత్యావసర వస్తువుల ధరలు నింగినంటుతున్నా కేంద్రం నియంత్రించడంలో విఫలం అయిందని అన్నారు.జాతీయస్థాయిలో యుద్ధ వాతావరణం వల్ల ముడి చమురు రేట్లు పెరిగాయని సాకు చూపిస్తూ నిత్యావసర వస్తువుల ధరలు పెంచితే పేదవాని జీవనం ఎలా కొనసాగాలని ప్రశ్నించారు. వంట గ్యాస్‌తో పాటు కమర్షియల్ గ్యాస్ ధరలు పెంచడం వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన చిన్న చిన్న వ్యాపారస్తులు ఉపాధి కోల్పోయి రోడ్డుమీద పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి,రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి,రాష్ట్ర సమితి సభ్యులు ఆదరి శ్రీనివాస్, మండ సదాలక్ష్మి, జిల్లా సహాయ కార్యదర్శులు తోట బిక్షపతి, మద్దెల ఎల్లేష్, జిల్లా నాయకులు కర్రె లక్ష్మణ్, ఉట్కూరి రాములు, మునిగాల బిక్షపతి, ఏదునూరి వెంకట్రాజం భాషా బోయిన సంతోష్, కొట్టెపాక రవి,జక్కు రాజు గౌడ్, వేల్పుల సారంగపాణి, నేదునూరి రాజమౌళి,బత్తిని సదానందం,మెట్టు శ్యామ్ సుందర్ రెడ్డి,రాసమల్ల దీనా, రామ రాజశేఖర్,శనిగరపు రాజ్ కుమార్,శంకర్ నాయక్, గుంటి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.



