ఎయిర్‌ ఇండియా విమానానికి బెదిరింపు కాల్‌


కోల్‌కతా,ఆగస్ట్‌19(జనం సాక్షి): పశ్చిమ బెంగాల్‌ కోల్‌కతాలోని నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఎయిర్‌ ఇండియా కార్యాలయానికి బుధవారం రాత్రి బెదిరింపు వచ్చింది. రాత్రి 7 గంటల సమయంలో ఓ దుండగుడు విమానాన్ని హైజాక్‌ చేయనున్నట్లు ఫోన్‌ చేశాడు. అయితే, సదరు వ్యక్తి బెంగాళీలో మాట్లాడడని.. తన పేరును ప్రశాంత బిశ్వాస్‌గా చెప్పాడని విమానాశ్రయ అధికారులు తెలిపారు. అయితే, దీనికి సంబంధించి ఎయిర్‌ ఇండియా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. వెంటనే అప్రమత్తమైన అధికారులు స్థానిక బిధానగర్‌ పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు సదరు వ్యక్తి కోసం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎయిర్‌ ఇండియా కార్యాలయానికి వచ్చిన కాల్‌ ఆధారంగా ఫోన్‌ నంబర్‌ను ట్రేస్‌ చేశారు. ఉత్తర 24 పరగనాస్‌ జిల్లాలోని బొంగావ్‌ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఫోన్‌ చేసినట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అయితే, అతని మానసిక పరిస్థితి సరిగా లేదని తెలుస్తుండగా.. పోలీసులు విచారిస్తున్నారు.