కలాలపై మన్ను కప్పితే అవి గన్నులై పైకి లేస్తాయి..!

ఒక కలం తెలంగాణ బతుకు చిత్రాన్ని ఆవిష్కరించింది…ఒక కలం తెలంగాణపై సీమాంధ్ర వివక్షను కళ్లకు చాటింది..అదే సీమాంధ్ర పెట్టుబడిదారులకు కంటగింపుగా మారింది..జీవ వైవిధ్య సదస్సు వేదికపై సాక్షాత్తు ప్రధాని సాక్షిగా తెలంగాణ మీడియాపైనా తమ వివక్షను కొనసాగించిండ్రు..తెలంగాణ నినాదాన్ని, తెలంగాణ ఆత్మగౌరవ ఉద్యమాన్ని ప్రపంచానికి చాటిన మీడియాపై తమ దురహంకారాన్ని ప్రదర్శించిండ్రు..తరతరాలుగా తెలంగాణకు జరుగుతున్న వివక్షను మీడియాపైనా చూపారు..ఎక్కడ తెలంగాణ నినాదాన్ని వినిపిస్తరో అని భయపడ్డ ప్రభుత్వం తెలంగాణ మీడియా ప్రతినిధులకు సమావేశంలోకి అనుమతించలేదు..తెలంగాణ గడ్డపై మీడియాను నడపడమే పాపమన్నట్లు భావించింది సీమాంధ్ర సర్కారు..దీంతో తెలంగాణవాదులు భగ్గుమన్నరు..సీమాంద్ర సర్కారు చర్యపై నిరసన వ్యక్తం చేసిండ్రు..సీమాంధ్ర సర్కారు వివక్షపై తెలంగాణ జర్నలిస్టుల ఫోరం తీవ్రంగా స్పందించింది. దీనిలోనే భాగంగానే నేడు కలాల కవాతు తలపెట్టింది..పెన్నుల మీద మన్ను గప్పితే అవి గన్నులై గగనానికి లేస్తయి..అన్నట్లుగా కలం వీరులు కవాతుకు చేసేందుకు సిద్దమయ్యారు..కదం కదం కలిపి సీమాంధ్ర దురహంకారానికి వ్యతిరేకంగా పోరు చేసేందుకు రెడీ అయ్యారు..తెలంగాణ ఉద్యమవీరులకు స్పూర్తినిచ్చిన మిలియన్‌ మార్చ్‌, సాగరహారాల సాక్షిగా టాంక్‌బండ్‌పై కలాలతో కవాతు నిర్వహించనున్నరు..తెలంగాణ ఉద్యమ నినాదాన్ని ప్రపంచానికి చాటుతున్నందుకు తెలంగాణ మీడియాను ప్రధాని పర్యటనకు అనుమతించకపోవడం అప్రజాస్వామికం..ఉద్దేశ్యపూర్వకంగా ఓ ప్రాంత మీడియాను అనుమతించకపోవడం దేశ ప్రజాస్వామ్య చరిత్రలో దురదృష్టకరమైన ఘట్టం..ఈ సంఘటన ద్వారా ప్రభుత్వం ఒక దుష్ట సంప్రదాయానికి తెరతీసింది..ఓ ప్రాంత ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షను ప్రపంచానికి చాటడమే తప్పన్నట్లు సీమాంధ్ర సర్కారు వ్య్వహరించడం అప్రజాస్వామికం కాదా..? ఈ సంఘటనను ఏ విధంగానూ సమర్ధించుకోలేదు..అందుకే ప్రభుత్వం ఇంత వరకూ దీనిపై అధికారంగా స్పందించేందుకు ఇష్టపడడంలేదు..పైగా ఇది చాలా లైట్‌గా తీసుకోవాల్సిన సంఘటన అయినట్లు సమాచార ప్రసార మంత్రి డికె అరుణ విచారం వ్యక్తం చేశారు..పైగా దీనిపై విచారణ జరుపుతామంటూ అక్కరలేని హామీని ఇచ్చింది..ఈ సమయంలో తెలంగాణ సమాజం యావత్తూ తెలంగాణ జర్నలిస్టుల వెంట నిలిచింది..వారికి జరిగిన అవమానం యావత్‌ తెలంగాణకు అవమానమని భావించి తీవ్ర నిరసనలు, ఆందోళనలు నిర్వహించారు..ఇంతకాలం ఉద్యోగ, విద్యా, వైద్య తదితర రంగాలకు మాత్రమే ఉన్న వివక్ష ఇపుడు తెలంగాణ మీడియాకు సైతం ఆపాదించి రాష్ట్రప్రభుత్వం చరిత్రలో ఒక కొత్త సాంప్రదాయానికి తెరతీసింది..సమాజంలో నాలుగో స్థంభంగా ఉంటూ ప్రజల ఆకాంక్షలకు రూపం కల్పిస్తూ, వారి ఆశ, లక్ష్యాలను  ప్రపంచానికి చాటే మీడియాకు వివక్ష ఆపాదించడం కేవలం సీమాంధ్ర సర్కారుకే చెల్లింది..అందుకే నేడు తెలంగాణ ప్రజా యావత్‌ తెలంగాణ జర్నలిస్టులకు అండగా నిలుస్తోంది..తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపస్తూ రథసారధిలా వ్యవహరిస్తోన్న తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరాం తెలంగాణ కలాల కవాతుకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. తాము సైతం ఈ కవాతులో పాల్గొననున్నట్లు ప్రకటించారు..మా కలలను కల్లలు చేస్తే కలాలను కత్తులు చేసి తిరగబడతమని తెలంగాణ జర్నలిస్టులు నేడు సీమాంధ్ర సర్కారుకు చాటనున్నారు. తెలంగాణలో జరిగిన అన్యాయాలు, తెలంగాణ జర్నలిస్టులకు జరిగిన అవమానాలు సీమాంధ్ర మీడియాకు కనబడడం లేదా అని వారు ప్రశ్నిస్తున్నారు..అందుకే తెలంగాణలోని ప్రతి జర్నలిస్టు కలాల కవాతుకు సిద్ధం అయి రావాలి..ప్రతి జర్నలిస్టూ షోయబుల్లాఖాన్‌ వారసులు కావాలి..తెగింపు కలిగిన తెలంగాణ కలం వీరులందరూ టాంక్‌బండ్‌కు వచ్చి తెలంగాణ కలం దెబ్బను సీమాంధ్ర సర్కారుకు చాటాలి..తెలంగాణ జర్నలిస్టుల ఐక్యత ప్రపంచానికి చాటాలి..