కాల్మొక్త బాంచన్.. కంపని మూయించుండ్రి
పర్లపల్లికెవరెల్లినా పాదాలపై పడడమే
ఒల్లంతా పుండ్లు.. ఒళ్లు జలదరించే వాస్తవాలు
అమ్మలు కాలేక మహిళల ఆవేదన
డాక్టర్లకు కనిపించిన దారుణ నిజాలు
కరీంనగర్ , జూలై 30 (జనంసాక్షి):
పర్లపల్లికెవరెల్లినా వెనుకాముందుసూడకుండా కాల్లపై పడుతారు జనం. కాల్మొక్తబాంచన్ కంపనీమూయించడి అని కంటినిండా నీళ్లను నింపుకుంటారు. కారణం లేకపోలేదు.. ఆ ఊర్లో ఎవరిని చూసినా సరే రాక్షస హృదయాలు సైతం కన్నీటి దారలు కురిపిస్తాయి. చర్మం కుళ్లిపోయి కొందరు, బొబ్బలెక్కి మరికొం దరు, ఒల్లంతా పుండ్లై చీమూ నెత్తురు కారుతూ ఇంకొందరు కనబడతారక్కడ. అంతే కాదు అవయవాలు కోల్పోయి తిప్పలు పడుతున్న వారెందరో ఇక్కడ దర్శనమిస్తారు. చక్కని బిడ్డకు జన్మనిచ్చి అమ్మ పదానికి సార్థకత తెచ్చుకోవాలన్న గంపెడాశతో ఎదురు చూసే గర్భవతు లెందరికో ఆ అదృష్టం దక్కకుండానే కడుపులో
ఉన్న పసికూన కాటిని చూడకుండానే కానరాని లోకాలకు వెల్లిపోతుంది. ఇదంతా సీమాంధ్రులు, తెలంగాణ బిడ్డలతో ఆడుతున్నరాక్షస క్రీడకు నిలువుటద్దంగా నిలుస్తున్న కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామ పరిస్థితి.
ఇది తెలుసుకున్న టీజేఏసీ ఆధ్వర్యంలో డాక్టర్ల బృందం సోమవారం గ్రామానికెళ్లింది. అడుగుపెట్టిన డాక్టర్ల కాళ్లు ఇక ఒక్క అడుగుకూడా ఊర్లోకి వేయలేమని మొరాయించాయి. గ్రామం ప్రారంభంలోనే షాక్‌కు గురైన ఆ డాక్టర్ల బృందానికి ఆ ఫ్యాక్టరీ జనారణ్యంలో నరకాన్ని చూపించింది. అసలిక్కడ మనుషులు ఎలా బతుకుతున్నారంటూ నోళ్లు వెల్లబెట్టారు. సేఫ్టిక్ ట్యాంకును తెరచి నిలుచున్న ఇంతటి దుర్ఘందం రాదంటూ ఆ వైద్య నిపుణులు చెప్పారంటే అక్కడి పరిస్థితి ఎంతటి భయానకమో అర్థం చేసుకోవచ్చు. లేచినప్పటి నుంచి పడుకునే వరకు తెలంగాణ కోసం ప్రాణత్యాగాలకు సిద్ధమంటూ ప్రగల్భాలు పలుకుతున్న అధికార పార్టీ నేతలకు, పక్కనే పున్నామ నరకాన్ని చూస్తున్న తన పల్లె జీవులు కనిపించకపోవడం నిజంగా దారుణం. పదవులు కాదు మాకు తెలంగాణ కావాలి, వస్తేనే తెలంగాణ బాగుంటుందంటూ అదిష్టానాన్ని సైతం దిక్కరిస్తున్న ఈ జిల్లా అగ్రనేతలకు ఈ దిక్కులేని జీవాలు కనిపించడం లేదా అన్నది జిల్లా వాసుల సూటి ప్రశ్న. దీనికి వారు జవాబేమిస్తారన్నది పక్కన బెడితే డాక్టర్ల బృందం కళ్లారా చూసిన ఛేదు చేదు నిజాల వివరాలు..
హరిత బయోప్లాంట్‌ను సందర్శించిన టీజేఏసీ డాక్టర్ల బృందం
కరీనంరగర్: టీజేఏసీ కమిటీ సూచన మేరకు సోమవారం డాక్టర్ల బృందం హరితబయో ప్లాంట్‌ను సందర్శించింది. పర్లపల్లి గ్రామపంచాయితీ పరిధిలోని బయోప్లాంట్‌లో ఉత్పత్తి చేస్తున్న పదార్థాల వల్ల కలుగుతున్న అనర్థాలపై నిగ్గు తేల్చాలని టీ జేఏసీ చైర్మన్ ప్రొ||కోదండరాం సూచించడంతో ప్లాంట్‌ను సందర్శించినట్లు జేఏసీ జిల్లా కో-ఆర్డీనేటర్ జక్కోజు వెంకటేశ్వర్లు, డా.విజయెందర్ రెడ్డిలు తెలిపారు. ప్లాంట్‌ను సంర్శించిన అనంతరం వారు పలు విషయాలు వెల్లడించారు. పరిశీలించిన ఆంశాలను ఒక నివేధిక రూపంలో రాష్ట్ర జేఏసీ చైర్మన్ ప్రొ||కోదండరాంకు అందిస్తామన్నారు. వాస్తవాలను వివరిస్తూ బయోప్లాంట్ మూసివేతకు ప్రభుత్వానికి మెమోరండం సమర్పిస్తామని వారు చెప్పారు. ప్రభుత్వం ఈ ప్లాంట్‌ను మూసివేసే విధంగా టీ-జేఏసీ కార్యాచరణ ఉంటుందన్నారు. ఈ ప్లాంట్ నుంచి వచ్చే వ్యర్తపదార్థాల వల్ల దుర్వాసన వస్తొందని, పరిసరాలలో నివసిస్తున్న వారు అనారోగ్యం పాలౌతున్నారని వారు వివరించారు. పర్యావరణం సైతం కలుషితమవుతోందన్నారు. భూగర్భజలాలు విషపూరితంగా మారడంతో ఆ నీరు తాగి ప్రజలు అనారోగ్యాల భారిన పడుతున్నారని వివరించారు. ప్లాంట్ వెదజల్లుతున్న విషవాయువు వల్ల ఊపిరితిత్తుల వ్యాదులు వస్తాయని, పిల్లలు పుట్టే అవకాశాలు కూడా దెబ్బతింటాయని చెప్పారు. ఉత్పత్తి చేసి లాభాలు పొందడం గురించే యాజమాన్యం ఆలోచిస్తోందని, పరిసరాల్లోని ప్రజల గురించి ఆలోచించండంలేదని వారు ఆవేధన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ నుంచి వచ్చే దుర్గందం వల్ల ఆ ప్రాంతంలో ఎవరు ఉండలేని పరిస్థితి ఉందన్నారు. ఈ కాలుష్యం వల్ల చివరకు పక్షులు కూడా చనిపోతున్నాయని వారు తెలిపారు. ఇక్కడి భూములు విషపూరితంగా మారాయని, పంటలు కూడా పండలేని స్థితికి చేరుకున్నాయన్నారు. ఇక్కడి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే, ఎంపీలు, జిల్లా కలెక్టర్ ప్లాంట్‌ను, పరిసరాలను సందర్శించి దీనిని మూసివేయించాలని డిమాండ్ చేశారు. వారంతా కనీసం ఒక్క గంటైన ఇక్కడ ఉండి ఆతరువాత ఇక్కడి ప్రజలు ఎలా జీవించాలో చెప్పాలని వారు పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పరిస్థితిని చక్కదిద్ది ఫ్యాక్టరీని మూసివేయకపోతే తమ ప్రాణాలను సైతం లెక్కచేయమన్నారు. ఆంధ్రాపెట్టుబడి దారులతో తెలంగాణ రాజకీయ నాయకులు చేతులు కలిపి ఇలా ప్రాణాలు హరించే ఫ్యాక్టరీలను జనారణ్యంలో స్థాపించడం ఎంతవరకు సమసంజసమని వారు ప్రశ్నించారు. సందర్శనలో జగదీశ్వర్, మోహన్‌లాల్, .కె.చంద్రబాబు, కె.సత్తిసాగర్‌రావు, టి. రాధిక తదితరులు పాల్గొన్నారు.
కన్నీటి పర్వంతమైన పర్లపల్లి గ్రామం
ప్రొ||కోదండరాం సూచన మేరకు పర్లపల్లి గ్రామంలో హరిత బయోప్లాంట్‌ను సోమవారం డాక్లర్ల బృందం పర్యటించింది. అడుగడుగునా గ్రామస్థులు కన్నీటి స్వాగతం పలికారు. తమ సమస్యలను ఏ అధికారులు పట్టించుకోవడం లేదంటూ కన్నీటి పర్వంతమయ్యారు. గ్రామ పంచాయితీ కార్యాలయానికి చేరుకున్న డాక్టర్ల కోసం ఉదయం నుంచి తమ సమస్యలను విన్నవించడానికి తరలివచ్చిన గ్రామస్థులు వారి సమస్యలను తీర్చాలంటూ ప్రాదేయపడ్డారు. తమ ప్రాణాలు పోయినా సరే ఈ ఫ్యాక్టరీని మాత్రం మూసివేయాలని వారు విన్నవించుకున్నారు. చిన్న, పెద్ద, ముసలి, ముతక అంటూ తారతమ్యం లేకుండా అందరూ ప్యాక్టరీ మూసివేయాలంటూ విలపించారు. తన కొడుకు ఫ్యాక్టరీ నుంచి వెలువడే దుర్వాసన వల్లే చనిపోయాడంటూ కాళ్లపై పడి విలపించడం డాక్టర్ల హృదయాలను కలిచివేసింది. కొందరైతే చేతులకు, కాళ్ళకు దురద కారణంగా వచ్చిన బొబ్బలను చూపిస్తూ విలపించారు. గుండెజబ్బులు వస్తున్నాయని , ఆడవారు తమ గర్బం కోల్పోయారని డాక్టర్లకు విన్నవించుకున్నారు. ఇలా ఒక్కరేమిటి గ్రామంలోని ప్రతిఒక్కరు సమస్యలను చెపుతుంటే డాక్టర్లు హతాశులయ్యారు. ప్లాంట్‌లోనికి వెళ్లిన డాక్టర్లకు కళ్లు బైర్లుకమ్మే కఠిననిజాలు కనిపించాయి. సుమారు వంద ఎకరాల విస్తీర్ణంలో నెలకొల్పిన ఈగలు , దోమలు , దుర్వాసన, అడుగడుగునా తిన్నదంతా కక్కుకునేలా కనిపించే వ్యర్థాలు వారికి దర్శనమిచ్చాయి. దుర్వాసన వస్తున్న స్థలాలను, విషవాయువులు వెదజల్లుతున్న వైనాన్ని వారు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ వాయువు వల్ల మండలంలోని 9గ్రామాల పరిధిలోని చెట్లు చేమలతో పాటు పశుపక్షాదులు, పంటపొలాలు, జీవిస్తున్న ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని వారు గ్రహించారు. పూడ్చిపెట్టిన రసాయనాలు భూమిలోంచి పొగల రూపంలో బయటకు వస్తుండడం చూసి డాక్టర్లు అవాక్కయ్యారు. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే అనుబాంబు కారణంగా ‘హిరోషిమా నాగసాకి’ పరిస్థితి ఈ ప్రాంతానికి వస్తుందని డాక్టర్లు అభిప్రాయపడ్డారు.