ఒడిషాలో ఎన్‌కౌంటర్‌

` మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు పాకా హనుమంతు అలియాస్‌ గణేశ్‌ ఉయికే
` ఆయనతోపాటు మరో ముగ్గురు మావోయిస్టులు మృతి
` హనుమంతు స్వస్థలం తెలంగాణలోని నల్గొండ జిల్లా చండూరు మండలం పుల్లెంల గ్రామం
చండూరు డిసెంబర్‌ 25 (జనంసాక్షి): ఒడిశాలోని కందమాల్‌ జిల్లా గుమ్మా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. వీరిలో మావోయిస్టు కీలక నేత, కేంద్ర కమిటీ సభ్యుడు పాకా హనుమంతు అలియాస్‌ గణేశ్‌ ఉయికే ఉన్నట్లు పోలీసులు వెల్లడిరచారు. ఆయనపై రూ.1.10 కోట్ల రివార్డు కూడా ఉందని తెలిపారు.హనుమంతు స్వస్థలం తెలంగాణలోని నల్గొండ జిల్లా చండూరు మండలం పుల్లెంల గ్రామం అని అధికారులు తెలిపారు. మరోవైపు ఘటనాస్థలిలో ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో మావోయిస్టుల కోసం గాలింపు కొనసాగుతోంది.
గణేశ్‌ నేపథ్యం ఇదీ..
పాక చంద్రయ్య, పాపమ్మ దంపతుల ఆరుగురు సంతానంలో గణేష్‌ మొదటివారు. ఆయన 1961లో జన్మించారు. హనుమంతుకు ముగ్గురు చెల్లెళ్లు, ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. చండూరులో పదోతరగతి, ఇంటర్‌, డిగ్రీ నల్గొండలో చేస్తూ రాడికల్‌ యూనియన్‌లో పనిచేశారు. 45 ఏళ్ల క్రితం ఏచూరి శ్రీనివాస్‌ హత్యలో ఆయన కీలకపాత్ర పోషించారు. అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లి నక్సలైట్‌ ఉద్యమంలో చేరారు. అప్పటినుంచి ఆయన ఇంటివైపు చూడలేదు. ఆయన అమ్మ, నాన్న చనిపోయినప్పుడు కూడా రాలేదు. మండల కమిటీ నుంచి జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయి నేతగా ఎదిగి మూడు రాష్ట్రాలకు కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేశారు. ఇటీవలి కాలంగా ఆరోగ్యం బాగాలేక ఇబ్బంది పడుతున్నారని సమాచారం.పాక హనుమంతు చిన్నప్పటినుంచే కమ్యూనిస్టు భావజాలం కలిగి ఉన్నారని ఆయన సోదరుడు తెలిపారు. హనుమంతు తండ్రి సీపీఎం పార్టీలో పనిచేశారు. దీంతో చదువుకునే రోజుల్లోనే ఉద్యమం వైపు వెళ్లారు.

ఇది చారిత్రాత్మక విజయం
` మార్చి 31 నాటికి నక్సలిజం అంతం చేస్తాం
` ఎన్‌ కౌంటర్‌పై స్పందించిన అమిత్‌షా
న్యూఢల్లీి(జనంసాక్షి):నిషేధిత మావోయిస్ట్‌ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఒడిశాలోని కంధమాల్‌ జిల్లాలో జరిగిన భారీ ఎన్‌ కౌంటర్‌లో ఒడిశా ఇన్‌ఛార్జ్‌ గణేష్‌ ఉయికే (69) సహా ఆరుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు.గురువారం ఉదయం కంధమాల్‌`గంజాం జిల్లా సరిహద్దులోని దట్టమైన రాంపా అటవీ ప్రాంతంలో ఒడిశా పోలీసుల స్పెషల్‌ ఆపరేషన్స్‌ గ్రూప్‌ (ఎస్‌ఓజి), సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సిఆర్‌పిఎఫ్‌) మరియు బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బిఎస్‌ఎఫ్‌)లతో కూడిన ఉమ్మడి భద్రతా దళంతో జరిగిన ఎన్‌కౌంటర్‌గణేష్‌ ఉయికేతో పాటు ఇద్దరు మహిళా మావోయిస్టులు సహా మొత్తం నలుగురి మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.మరోవైపు ఈ ఎన్‌కౌంటర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పందించారు. గణేష్‌ ఉయికే మృతిని ధృవీకరించిరిన అమిత్‌షా 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని నిర్మూలిస్తాం అంటూ హోం మంత్రి ట్వీట్‌ చేశారు. ‘’నక్సల్‌ రహిత భారత్‌ దిశగా ఒక ముఖ్యమైన మైలురాయి’’గా హోంమంత్రి అభివర్ణించారు. అటు ఇది మన దళాలకు చారిత్రాత్మక విజయం. రూ. 1.1 కోట్ల రివార్డు ఉన్న నాయకుడి నిర్మూలనతో ఈ ప్రాంతంలోని మావోయిస్టుల నడ్డి విరిచినట్టేనని ఈ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్న ఒక సీనియర్‌ అధికారి తెలిపారు. కాగా ఈ ఆపరేషన్‌ భారత ప్రభుత్వాన్ని మార్చి 2026 నాటికి మావోయిస్టు రహిత దేశాన్ని చేయాలనే తన లక్ష్యానికి దగ్గరి చేస్తోంది. ఈ ఏడాది మే నెలలో జనరల్‌ సెక్రటరీ బసవరాజ్‌,నవంబర్‌లో కమాండర్‌ హిడ్మాలను మట్టు బెట్టడంతో కేంద్ర కమిటీ కుప్పకూలింది. అటు అగ్ర మావోయిస్టు నాయకులతోపాటు లొంగిపోతున్నవారి సంఖ్య కూడా పెరుగుతోంది.
జిరామ్‌ ఘాటి మాస్టర్‌ మైండ్‌
2013లో ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన జిరామ్‌ ఘాటి మారణకాండ వెనుక గణేష్‌ ఉయికే ప్రధాన సూత్రధారి. ఈ ఘటనలో అనేక మంది సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు మరణించారు. అంతేకాదు అనేక హై ప్రొఫైల్‌ మావోయిస్టు దాడులలో ఆయనదే కీలక పాత్రం నమ్ముతారు. గతమూడేళ్లుగా గణేష్‌ ఒడిశాలోని కంధమాల్‌ ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తూ, గెరిల్లా కార్యకలాపాలను సమన్వయం చేస్తూ, మావోయిస్టు నెట్‌వర్క్‌లను బలోపేతం చేస్తున్నాడు.