ప్రకాశ్ నగర్ బ్రిడ్జి దగ్గర బాలిక మృతదేహం

డిసెంబర్ 25 ( జనంసాక్షి):ఖమ్మం జిల్లా ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలో బాలిక మృతదేహం లభించడం కలకలం రేపింది. వెంకటగిరి నుంచి ఖమ్మం వైపు వెళ్లే ప్రధాన రహదారిపై గల ప్రకాశ్ నగర్ బ్రిడ్జి కింది భాగంలో మున్నేరు కాల్వ సమీపంలో మృతదేహం లభ్యమైంది.
శుక్రవారం ఉదయం బాలిక మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని పరిశీలించారు. బాలిక వయసు 17 సంవత్సరాలు ఉండొచ్చని తెలిపారు. కాగా, బాలిక వివరాలను కనుగొనేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ ప్రాంతానికి సమీపంలోని ఇటుకల బట్టీలో ఒడిశాకు చెందిన కుటుంబాలు పనిచేస్తాయి. ఆ కార్మికుల కుటుంబానికి చెందిన బాలికనే అయ్యి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. బ్రిడ్జిపై నుంచి ప్రమాదవశాత్తూ పడి చనిపోయిందా? ఆత్మహత్య చేసుకుందా? లేదా ఎవరైనా హత్య చేసి ఉంటారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



