కుంటుపడిన అభివృద్ధి

గుంటూరు, జూలై 20: రాష్ట్ర ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని మరిచిపోయిందని, అభివృద్ధి పూర్తిగా పడకేసిందని చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ జిల్లా అధ్యక్షుడు ఎ. అంజనేయలు అన్నారు. స్థానిక చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కార్యాలయంలో శుక్రవారం విలేఖరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పన్నులు పెంచటమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. పన్నులతో ప్రభుత్వం పేదవాడినడి విరుస్తోందన్నారు. విద్యుత్‌ కోతల వలన పరిశ్రమల్లో ఉత్పత్తిగణనీయంగా పడిపోయిందన్నారు. తద్వారా కార్మికులు ఉపాధి కోల్పోయి వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని అన్నారు. సిమెంట్‌ ప్లాస్టిక్‌ పేపర్‌ వంటి 10 రకాల వస్తువుల రవాణాకు వేబిల్లులు తప్పనిసరి అని ప్రభుత్వం జీవో విడుదల చేయడంవన వ్యాపారులు అనేక ఇబ్బందలు, వేదింపులకు గురవుతున్నారన్నారు. తక్షణమే ఆ జీవోను ఉప సంహరించుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అలా జరగని పక్షంలో వ్యాపార సంఘాలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టి అవసరమైతే దుకాణాల బంద్‌ను కూడా పాటిస్తామని తెలిపారు.