మావోయిస్టు పార్టీ లీగల్‌కు అనుమతివ్వండి

` ఆ పార్టీ అగ్రనేతల వినతి.. అమిత్ షాతో సీఎం రేవంత్ మధ్యవర్తిత్వం
` ఇతర నాయకత్వంతో మాట్లాడి పీఎల్‌జీఏ రద్దు చేసుకుంటాం
` ఇటీవల లొంగుబాటు సందర్భంగా సీఎంకు వివరించిన నేతలు
` ఢిల్లీలో భేటీలో సీఎంతో పాటు డీజీపీ శివధర్ రెడ్డి, ఎసఐబీ సుమతి
న్యూఢిల్లీ, మార్చి 4 (జనంసాక్షి) :
మావోయిస్టు పార్టీలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంటున్నట్టు తెలుస్తోంది. మావోయిస్టు పార్టీ లీగల్‌గా మారి పనిచేసుకునేందుకు అందులోని కొందరు కీలక నేతలు అంగీకరించినట్టుగా సమాచారం. పీఎల్‌జీఏను కూడా రద్దు చేసుకుని, ఇతర నాయకత్వంతోనూ సమాలోచనలు చేసి రాజకీయ పార్టీగా మలుచుకునేందుకు తమకెలాంటి అభ్యంతరం లేదని ఇటీవల లొంగుబాటు సందర్భంగా మావోయిస్టు నేతలు పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్రంతో మధ్యవర్తిత్వం వహించాలని సీఎం రేవంత్ రెడ్డిని వారు కోరినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో బుధవారం ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. కేంద్ర ీVAంమంత్రి అమిత్ షాతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎంతో డీజీపీ శివధర్ రెడ్డి, ఎసఐబీ చీఫ్ సుమతి, అదనపు డీజీపీ విజయ్ కుమార్ కూడా ఉండటం గమనార్హం.
ఆపరేషన్ కగార్ నేపథ్యంలో జనజీవన స్రవంతిలోకి మావోయిస్టు పార్టీ నేతలు వస్తున్న దరిమిలా తెలంగాణ సర్కారు వారిలో విశ్వాసం పెంచేలా చర్యలు చేపడుతున్న విషయం విదితమే. ఈ మేరకు డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట గతవారమే మావోయిస్టు పార్టీ అగ్రనేతలు దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి, బడే చొక్కారావు, నూనె నర్సింహారెడ్డి లొంగిపోయారు. ఈ సందర్భంగా పార్టీలోని అంతర్గత విషయాలను పెద్దగా ప్రస్తావించని నేతలు.. తదనంతరం సచివాలయంలో సీఎంతో భేటీ సందర్భంగా పలు కీలక అంశాలను వివరించినట్టు తెలిసింది. పునరావాసం పొందినవారికి భద్రత, ప్రజలతో కలిసి పనిచేసేందుకు వీలుగా వెసులుబాట్లు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఇతర మావోయిస్టు నేతలు కూడా జనజీవన స్రవంతిలోకి వచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలని, పార్టీలోని ఇతర నాయకత్వంతో మాట్లాడి పీఎల్‌జీఏను రాజకీయ పార్టీగా మలిచేందుకు కూడా తమకు అభ్యంతరం లేదని పేర్కొన్నట్టు సమాచారం. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వంతో మధ్యవర్తిత్వం చేస్తే అత్యంత త్వరలోనే లీగలైజ్‌గా మారేందుకు సిద్ధమని సీఎం రేవంత్‌తో చెప్పడం, బుధవారం ఢిల్లీలో అమిత్‌షాతో భేటీకావడం, మావోయిస్టు పార్టీలోని పరిణామాలపై చర్చలు జరపడం పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలిసిన అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతికి సంబంధించిన అంశంపైనా షా ఎదుట ప్రస్తావించినట్టు తెలిసింది. ఈ భేటీకి సంబంధించిన విషయాలపై ఒకట్రెండు రోజుల్లోనే స్పష్టత వచ్చే అవకాశమున్నట్టు భోగట్టా.
తెలంగాణ రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఐపీఎస్ అధికారుల సంఖ్యను కేటాయించాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి బుధవారం రాత్రి భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన అనంతరం 2016లో మొదటి క్యాడర్ రివ్యూ జరిగిందని… 2021లో జరగాల్సిన క్యాడర్ రివ్యూ చాలా ఆలస్యంగా 2025లో జరిగిందన్నారు. ఆ సమయంలోనూ కేవలం 7 గురు ఐపీఎస్ అధికారులను మాత్రమే తెలంగాణకు కేటాయించారని సీఎం వివరించారు. దేశంతో పాటు తెలంగాణ రాష్ట్రం సైబర్ నేరాలు, డ్రగ్స్, వైట్ కాలర్ నేరాలు సహా ఇతర అనేక ఆధునిక సవాళ్లను ఎదుర్కొంటోందని సీఎం తెలిపారు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణ, ఫ్యూచర్ సిటీ కమిషనర్, హైదరాబాద్ నగరంలో భారీగా పెరుగుతున్న జనాభా నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ఐపీఎస్ అధికారుల అవసరం ఉందని కేంద్ర మంత్రి అమిత్ షాకు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మూడో క్యాడర్ రివ్యూను నిర్దేశిత 2026 సంవత్సరంలోనే చేపట్టాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం 83 ఐపీఎస్ అధికారులు రాష్ట్రంలో ఉన్నారని… ఆ సంఖ్యను 105 కు పెంచి కేటాయించాలని సీఎం కోరారు.