సీఎం ఎదుట నేడు 100 మంది మావోయిస్టుల లొంగుబాటు!

ఆయుధాలతో సహా పీఎల్‌జీఏ నాయకులు సరెండర్
తెలంగాణలోనే ఇది మొట్టమొదటి భారీ లొంగుబాటు ప్రక్రియ
హైదరాబాద్ (జనంసాక్షి) : గత రెండేళ్లుగా తెలంగాణలో మావోయిస్టుల పునరావాసానికి మెరుగైన చర్యలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం.. మిగిలిన నాయకత్వాన్ని సైతం జనజీవన స్రవంతిలోకి ఆహ్వానిస్తున్న విషయం విదితమే. సామన్య పౌరులుగా సాధారణ జీవతాన్ని గడిపేందుకు అన్నివిధాలా సహాయసహాకారాలు అందిస్తున్న నేపథ్యంలో ఇటీవల కీలక నేతలు సైతం తెలంగాణ పోలీసుల ఎదుట లొంగుబాట పట్టారు. రెండేళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా 591 మంది మావోయిస్టులు పునరావాసం పొందారని వెల్లడించిన డీజీపీ శివధర్ రెడ్డి.. పోలీసు శాఖ సమన్వయం సత్ఫలితాలిచ్చినట్టు పేర్కొన్నారు. అయితే, అగ్రనేతలు దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి, బడే చొక్కారావు, నూనె నర్సింహారెడ్డి లొంగుబాటు.. గణపతి కూడా పోలీసుల అదుపులో ఉన్నట్టు ప్రచారం సాగుతున్న తరుణంలో తెలంగాణలోనే మరికొందరు మావోయిస్టు నాయకులు సరెండర్ కానున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. నేడు 100 మంది పీఎల్‌జీఏ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి ఎదుట ఆయుధాలతో లొంగిపోనున్నట్టు సమాచారం. ఆయుధాలను సమర్పించి ఒకేసారి భారీమొత్తంలో సరెండర్ కావడం తెలంగాణలో ఇది మొదటిసారి. తెలంగాణ ప్రభుత్వంపై, ప్రజాస్వామ్య వ్యవస్థపై కొత్త విశ్వాసంతోనే మావోయిస్టులు లొంగుబాట పట్టారని పలువురు మేధావులు భావిస్తున్నారు.



