కొండగట్టులో పవిత్రోత్సవాలు

జగిత్యాల,మార్చి11(జ‌నంసాక్షి): ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో లోక కల్యాణార్థం త్రయహ్నిక దీక్షతో పవిత్రోత్సవాలు ఆదివారం రాత్రి ప్రారంభమయ్యాయి.సోమవారం తెల్లవారు జామున 3 గంటలకు తిరుమంజనం, ఆరాధన, 9:30 గంటలకు పవిత్ర ఆహ్వానం, పుణ్యహ వచనం, రక్షా బంధనం, రుత్విక్‌ వరుణం, యాగశాల ప్రవేశం, స్థాపిత దేవతార్చన, అగ్ని ప్రతిష్ట, హవనం, స్వామి వారికి అభిషేకం, అర్చన, మహా నివేదన, మంత్ర పుష్పం, తీర్థ ప్రసాద వితరణ జరిగాయి.రాత్రి విశ్వక్షేన ఆరాధన, పుణ్యహవచనం, అంకురారోహణ, అఖండ దీప స్థాపన తదితర ప్రత్యేక పూజాది కార్యక్రమాలను ఆలయ వ్యవస్థాపక వంశీయులు, అనువంశిక అర్చకులు నిర్వహించారు.  గతేడాది పూజల్లో జరిగిన లోపాలకు పరిహారంగా, చాత్తాద శ్రీ వైష్ణవ ఆచార సంప్రదాయాలను అనుసరించి  వీటిని చేపట్టారు. మంగళవారం కావడంతో నేడు భక్తులు అధికంగా వస్తారని ఆశిస్తున్నారు. తీర్థ, ప్రసాద వితరణ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆలయ ఈవో, డిప్యూటీ కలెక్టర్‌ పరాంకుశం అమరేందర్‌ తెలిపారు. ఉత్సవాలు బుధవారం దాకా కొనసాగుతాయని భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరారు.