కోచ్‌ గోపిచంద్‌ను తప్పుపట్టిన జ్వాలా గుత్తా

హైదరాబాద్‌, నవంబర్‌ 10 : బ్యాడ్మింటన్‌ కోచ్‌ గోపిచంద్‌పై స్టార్‌ షట్లర్‌ జ్వాలా గుత్తా ఆగ్రహం వ్యక్తం చేసింది. జాతీయ కోచ్‌గా ఉన్న గోపీచంద్‌ సొంత ప్రైవేట్‌ అకాడమీని నిర్వహించడం సరి కాదని ఆమె అన్నది. జాతీయ చీఫ్‌ కోచ్‌ గోపిచంద్‌ బ్యాడ్మింటన్‌కు పెద్ద అన్ని, సొంత ప్రైవేట్‌ అకాడమీని నిర్వహిస్తున్న వ్యక్తి జాతీయ కోచ్‌గా ఉండడం నైతికంగా సరికాదని ఆమె అన్నారు. గోపిచంద్‌ సెలెక్షన్‌ ప్యానెల్‌లో ఉంటే క్రీడాకారులందరికీ న్యాయం జరుగుతుందా ? జాతీయ జట్టు ఎంపికలో నిష్పాక్షికంగా వ్యవహరించగలరా ? అని ఆమె ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచే గాక చాలా రాష్ట్రాల నుంచి క్రీడాకారులు ఎదుగుతున్నారని, ప్రతిభ ఉన్న వారికి అవకాశం కల్పించాలని జ్వాలా అన్నారు. తాను ఏ ఒక్కరినో వ్యక్తిగతంగా విమర్శించాలని మాట్లాడడంలేదు. వ్యవస్థ పారదర్శకంగా ఉండాలన్నదే తన అభిమతమని చెప్పింది. వసతులు, ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం సమకూరుస్తోందని, దేశానికి ఒక జ్వాల లేదా సైనా ఉంటే చాలదని ఆమె అభిప్రాయపడింది.

ప్రస్తుత బ్యాడ్మింటన్‌ వ్యవస్థపై కూడా జ్వాలా గుత్తా విరుచుకుపడింది. భారత బ్యాడ్మింటన్‌లో పారదర్శకత లోపించిందని. పక్షపాతం, రాజకీయాలకు చిరునామాగా మారిందని విమర్శించింది. ఏ ఒక్కరివల్లో బ్యాడ్మింటన్‌కు వన్నేరాదని, చాలమంది క్రీడాకారులు స్టార్లుగా ఎదిగినపుడే ఉజ్వల భవిత ఉంటుందంటూ సైనా పేరు ప్రస్తావించకుండా వ్యాఖ్యానించింది. ఎంతోమంది క్రీడాకారులు ఎదగాలని వ్యాఖ్యానించింది. తాను దూరమైతే అశ్విని, దిజుకు సరైన డబుల్స్‌ భాగస్వామి లేరని జ్వాలా చెప్పింది. బ్యాడ్మింటన్‌ ప్రస్తుతం ధనికుల క్రీడగా మారిందని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రతిభ ఉన్న క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించాలని ఆమె సూచించింది. బ్యాడ్మింటన్‌ సంఘం ప్రతినిధులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడింది. గతంలో తాను ప్రపంచ స్థాయి టోర్నీల్లో ఘన విజయాలు సాధించినపుడు సంఘం పెద్దలు కనీస గౌరవం ఇవ్వలేదని జ్వాల మరోసారి విమర్శించింది. తాను తెలుమ్మాయిని కాదా ? సత్కారాలకు అర్హురాలిని కాదా అంటూ ప్రశ్నించింది. కోచింగ్‌ క్యాంప్‌నకు తనను అనుమతించకుండా కోచ్‌ గోపిచంద్‌ వేధిస్తున్నాడంటూ కోర్టును ఆశ్రయించిన మరో క్రీడాకారిణి ప్రజక్తా సావంత్‌కు జ్వాల మద్దతు తెలిపింది. ప్రజక్తను క్యాంప్‌లో చేర్చుకోవాల్సిందిగా బాంబే హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.