కోహ్లి సేనపై ప్రశంశల జల్లు


లండన్‌,ఆగస్ట్‌18(జనంసాక్షి): ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో భారత జట్టు అసాధారణ విజయంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇటీవలి ఒలింపిక్‌ పతక విజేతలపై దేశవాసులు సంబరాలు చేసుకున్నట్టుగానే… చిన్నా, పెద్దా తేడా లేకుండా కోహ్లీ సేన అద్భుత ఆటతీరును కొనియాడుతున్నారు. సోమవారం చివరిరోజు ఆశలు కోల్పోయిన స్థితిలో టెయిలెండర్లు షమి, బుమ్రా భారత జట్టుకు భారీ ఆధిక్యాన్ని అందించిన విషయం తెలిసిందే. ఈ జోరుతో ఇంగ్లండ్‌ను 52 ఓవర్లలోపే ఆలౌట్‌ చేయగలిగింది. టీ20 ఫార్మాట్‌కు ప్రజాదరణతో టెస్టులు ప్రమాదంలో పడుతున్నాయనే ఆందోళనకు ఇలాంటి మ్యాచ్‌లు చెక్‌ పెడతాయన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ‘టెస్టు మ్యాచ్‌లో మజా అంటే ఇదే. ప్రతీ క్షణాన్ని ఆస్వాదించా. జట్టు కఠిన పరిస్థితుల నుంచి త్వరగా కోలుకోవడం, మొండి పట్టుదలను చూపడం నన్నెంతగానో ఆకట్టుకుంది. టీమిండియా అద్భుతంగా ఆడిరది’ అంటూ సచిన్‌ సంతోషాన్ని వ్యక్తం చేశాడు. అలాగే రెండో టెస్టును ప్రత్యక్షంగా తిలకించిన బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ కూడా జట్టు పోరాట పటిమను మెచ్చుకున్నాడు. ప్రతీ క్రికెట్‌ అభిమాని ఈ విజయాన్ని చిరకాలం గుర్తుంచుకుంటాడని వీవీఎస్‌ లక్ష్మణ్‌ అన్నాడు. వీరే కాకుండా షేన్‌ వార్న్‌, మైకేల్‌ వాన్‌ కూడా కోహ్లీసేనను ప్రశంసించారు. ఇంగ్లండ్‌ ఆటగాళ్లు పదే పదే నోటికి పని చెప్పడంవల్లే తమలో పట్టుదల పెరిగిందని కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తెలిపాడు. ‘జట్టును చూసి గర్వపడుతున్నా. మా వ్యూహాలను పకడ్బందీగా అమలు చేశాం. బ్యాట్‌తో మా పోరాటం అద్భుతం. అయితే తొలి మూడు రోజులు మా బౌలర్లకు పిచ్‌ అనుకూలించలేదు. బ్యాట్స్‌మెన్‌కు మొదటి రోజైతే చాలా కష్టంగా సాగింది. కానీ రెండో ఇన్నింగ్స్‌లో మేమాడిన విధానం ఆకట్టుకుంది. ముఖ్యంగా షమి, బుమ్రా గురించి ఎంత చెప్పినా తక్కువే. మా విజయానికి 60 ఓవర్లు సరిపోతాయనిపించింది. దీనికి తగ్గట్టుగానే మా పేసర్లు చెలరేగారు. ఇక మైదానంలో ప్రత్యర్థి ఆటగాళ్ల కవ్వింపులే ఈ మ్యాచ్‌ను విజయంతో ముగించాలనే కసిని పెంచాయి. చివరిసారి లార్డ్స్‌లో గెలిచినప్పుడు జట్టులో నేనూ ఉన్నా. కానీ ఈసారి మా ముందున్న స్వల్ప సమయంలోనే సత్తా చూపాలనుకున్నాం. సిరాజ్‌ తొలిసారి ఈ మైదానంలో ఆడినా అదరగొట్టాడు’ అని కోహ్లీ అభినందించాడు.