ఘనంగా శ్రీవారికి కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజన్‌ సేవ

తిరుమల, జూలై 10 : శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజన్‌ సేవ(ఆలయ శుద్ధి) కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం ఉగాది ఆస్థానం, వార్షిక బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి ఇతర పర్వదినాలకు ముందుగా వచ్చే మంగళవారం నాడు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ నెల 16న అనివార ఆస్థాన కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని ఆలయ అధికారులు చేపట్టారు. ఆలయంలోని ఆనంద నిలయం నుంచి బంగారు వాకిలి వరకు ఉభయ దేవేరీలు ప్రాంతం, గోడలు, పైకప్పు, పూజలకు వాడే సామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రం చేస్తారు. ఈ సమయంలో వెంకటేశ్వర స్వామి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి వేస్తారు. శుద్ధి అనంతరం మూలవిరాట్టుకు నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి, పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధంపొడి, కుంకుమ, కిచిలీగడ్డ వంటి సుగంధ ద్రవ్యాలతో కూడిన మిశ్రమంతో ఆలయాన్ని శుద్ధి చేస్తారు. అనంతరం మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగిస్తారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, నైవేద్యం అనంతరం భక్తులకు సర్వదర్శనానికి అనుమతి ఇస్తారు. కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని పురస్కరించుకుని అష్టదళ పద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి కుటుంబ సభ్యులు, ఈఓ ఎల్వీ సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు, జేఈఓ శ్రీనివాస్‌ కుటుంబసభ్యులు, సీవీఎస్‌ఓ అశోక్‌కుమార్‌ ఆలయ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు, ఓఎస్‌డీ డాలర్‌ శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.