జగన్‌ అవినీతిపై విజయమ్మ మౌనమేలా

                                            జగన్‌ అవినీతిపై విజయమ్మ మౌనమేలా

విజయమ్మ

విజయమ్మ

శ్రీకాకుళం, జూన్‌ 3  (జనంసాక్షి):
జగన్‌ అవినీతి అక్రమాలపై విజయమ్మ ఎందుకు మాట్లాడడం లేదని  కేంద్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎర్రన్నాయుడు ప్రశ్నించారు. శ్రీకాకుళం పట్టణంలోని స్థానిక ఆయన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎర్రన్నాయుడు మాట్లాడారు. లక్షల కోట్ల కుంభకోణాల్లో నిండామునిగిపోయిన తన కుమారుడిని సిబిఐ విచారించి అరెస్టు చేస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్ర అన్నడం అన్యాయమన్నారు. ఉప ఎన్నికల్లో సానుభూతితో ఓట్లు సంపాదించేందుకే ఆమె ప్రచారం నిర్వహిస్తున్నారని అన్నారు. గతంలో ఒక పత్రికపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం తగదని ప్రతిపక్ష నాయకులు వైఎస్‌ను ప్రశ్నించినప్పుడు చట్టం ముందు అందరూ సమానులే నని ఆయన స్పష్టం చేసిన విషయాన్ని విజయమ్మ గుర్తుంచుకోవాలన్నారు. అదే సిబిఐ పరిటాల రవి హత్య కేసులో ఏ-1గా ఉన్న జగన్‌కు క్లీన్‌చిట్‌ ఇచ్చినప్పుడు సిబిఐ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని వైఎస్‌ఆర్‌, జగన్‌ కితాబు ఇచ్చారని అన్నారు. మరి హైకోర్టు ఆదేశంపై సిబిఐ జగన్‌ను అక్రమ ఆస్తులపై విచారణ జరిపి ఆయనను అరెస్టు చేస్తే తమపై ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ప్రచారం చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. తమ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన గాలి జనార్దనరెడ్డి అవినీతిపై విజయమ్మ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ను ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. నరసన్నపేట ప్రజలు ప్రతి అంశాన్ని గమనిస్తున్నారని, ఈ ఉప ఎన్నికల్లో తగిన రీతిలో ఆ రెండు పార్టీలకు బుద్ధి చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జి. అప్పల సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.