‘తూర్పు’లో పెద్ద ఎత్తున మొక్కల పెంపకం

కాకినాడ, జూన్‌ 27 : వర్ష రుతువు ప్రారంభమైన దృష్ట్యా జిల్లాలోని అన్ని పంచాయితీలు, మున్సిపాలిటీలలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాలను ఉద్యమంలా చేపట్టాలని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌ నీతూప్రసాద్‌ అధికారులను కోరారు. జిల్లాలో వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో అన్ని ఆవాసాల్లో పచ్చని పర్యావరణాన్ని పెంపొందించేందుకు పెద్ద ఎత్తున మొక్కలను నాటే కార్యక్రమాలు నిర్వహించాలని ప్రత్యేకాధికారులు, మండల అధికారులను కోరారు. అన్ని పాఠశాలలు, హాస్టళ్లు, గ్రామ పంచాయితీ, మున్సిపల్‌ స్థలాలు, ఆర్‌ అండ్‌ బి, పంచాయితీ రాజ్‌ల రోడ్‌ మార్జిన్ల వెంబడి మొక్కలను నాటించి వాటి పోషణ, రక్షణకు తగు ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. నాటిన మొక్కలను రక్షణ కల్పించేందుకు పవర్‌ గ్రిడ్‌ కార్పోరేషన్‌ సంస్త 1000 ట్రీ గార్డులను కల్పించేందుకు ముందుకు వచ్చిందని, ఇదే రీతిలో మరికొన్ని సంస్థలు కూడా అందించేందుకు సుముఖంగా ఉన్నాయన్నారు. వర్షాకాలంలో సాధారణంగా ప్రబలే అంటు వ్యాధులను నివారించేందుకు అన్ని ఆవాసాల్లో ముమ్మర శానిటేషన్‌ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. త్రాగునీటి వనరులన్నిటినీ తగు విధంగా శుభ్రపరచడంతో పాటు క్లోరినేషన్‌ ఎప్పటికప్పుడు జరిగేలా చూడాలన్నారు. నీటి మురుగుకు తావు లేకుండా నివారించి చిత్తడి ప్రాంతాల్లో బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లించే ప్రక్రియ జరిపించాలన్నారు.