దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ
ఆర్థికంగా దివాళా తీయించిన ఘనత మోడీదే
దళితులను మోసం చేస్తున్న సిఎం జగన్
క్విట్ ఇండియా ఉత్సవాల్లో పిసిసి చీఫ్ శైలజానాథ్
విజయవాడ,ఆగస్ట్9(జనంసాక్షి): బీజేపీ ప్రభుత్వ హయాంలో దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు. దేశాన్ని ఆర్థికంగా దివాళా తీయించిన ఘనత మోడీదన్నారు.
క్విట్ ఇండియా ఉద్యమ దినోత్సవం సందర్భంగా ఏపీసీసీ కార్యాలయంలో శైలజానాథ్, ఏఐసీసీ సభ్యులు తదితరులు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా శైలజానాథ్ మాట్లాడుతూ నాడు బ్రిటిష్ వారు మనుషుల మధ్య విభేధాలు పెట్టి.. దోచుకున్నారని అన్నారు. నేడు ఆర్ఎస్ఎస్ భావజాలంతో బీజేపీ పాలకులు ప్రజల మధ్య కుల, మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి.. నియంతృత్వ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో బీజేపీకి ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. నాడు మహాత్మాగాంధీ క్విట్ ఇండియా అంటూ దేశ ప్రజలకు పిలుపునిచ్చారని గుర్తుచేశారు. ఎందరో మహనీయులు త్యాగాల వల్ల తెల్ల దొరలు దేశం విడిచి వెళ్లిపోయారని తెలిపారు. దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన ఏకైక కుటుంబం.. ఇందిరాగాంధీ కుటుంబమని ఆయన పేర్కొన్నారు. కానీ మోడీ వల్ల దేశం ఇప్పుడు ప్రమాదంలో పడిరదన్నారు. దళితులకు ఇచ్చిన హావిూలను అమలు చేయకుండా సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని శైలజానాథ్ విమర్శించారు. వైసీపీ నుంచి పలువురు నాయకులు సోమవారం కాంగ్రెస్లో చేరారు. వైసీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలకీర్తి రవి, వైసీపీ యువజన విభాగం రాష్ట్ర నేత కిషోర్, గిరిజన జేఏసీ నాయకులు తదితరులకు కాంగ్రెస్ కండువాలు కప్పి.. పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శైలజానాథ్ మాట్లాడుతూ దళితుల సంక్షేమాన్ని జగన్.. గాలికొదిలేశారన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్, జగన్ రెడ్డి పాలనలో సమాజంలో కుల విద్వేషాలు పెరిగిపోయాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ భావజాలం నచ్చి… చాలా మంది పార్టీలో చేరుతున్నారని తెలిపారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలని
ప్రజలు ఎదురు చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు.