నాయకత్వపు మార్పు ఉండదు

కృష్ణా డెల్టాకు నీరివ్వడం అన్యాయం : పాల్వాయి

న్యూఢిల్లీ, జూన్‌ 29 (జనంసాక్షి):తెలంగాణ ప్రాంతానికి నష్టం కలిగించేలా నాగార్జున సాగర్‌ నుంచి కృష్ణా డెల్టాకు నీరివ్వడం అన్యాయమని కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధనరెడ్డి అన్నారు. శుక్రవారంనాడు ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం దీనిపై పునరాలో చించుకోవాలని ఆయన కోరారు. లేకపోతే తెలంగాణ ప్రజలు ఉద్యమిస్తారని అన్నారు. సాగర్‌లో నీరు డెడ్‌స్టోరేజ్‌ లెవల్‌లో
ఉండగా కృష్ణా డెల్ల్టాకు నీరు వదలడం సమంజసం కాదన్నారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పు ఉంటుందని తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఎవరితోనూ చెప్పలేదని గోవర్థన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రపతి ఎన్నికలు ముగిసిన తర్వాతనే రాష్ట్రంపై సోనియా దృష్టి పెడతారని ఆయన అన్నారు. తెలంగాణ అంశాన్ని తేల్చిన తర్వాతనే ముఖ్యమంత్రి మార్పుపై సోనియా ఆలోచిస్తారని ఆయన అన్నారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితులపూ ఆమెకు పూర్తి అవగాహన ఉందన్నారు. రాష్ట్రానికి చెందిన పలువురు నేతల నుంచి ఆమె ఇప్పటికే అభిప్రాయాలను తెలుసుకున్నారన్నారు. తెలంగాణపై కానీ, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై కానీ తగిన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని అన్నారు. రాయల్‌ తెలంగాణ అంశం అలసలు చర్చనీయాంశంమే కాదన్నారు. ప్రస్తుత పది జిల్లాలతోనే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ దూకుడుని కాంగ్రెస్‌ పార్టీతో పాటు ప్రభుత్వం కూడా సమర్థంగా ఎదుర్కొలేకపోయిందని ఆయన అన్నారు. అందుకే ఓటమి పాలయ్యామని ఆయన అన్నారు. రానున్న ఎన్నికలకు ఇప్పటినుంచే తగిన ప్రణాళికలతో కార్యకర్తలను ఉత్తేజపర్చి సమాయత్తం కావాలని అన్నారు.