ప్రజా సమస్యలపై దశలవారి ఉద్యమాలు

గుంటూరు, జూలై 8 : ప్రజా సమస్యలపై ప్రత్యక్ష ఆందోళనలు చేపట్టాలని తెలుగుదేశం పార్టీ జిల్లా ముఖ్య నేతలు తీర్మానించారు. వ్యాపిక్‌ ప్రాజెక్టు, విద్యుత్‌ కోతలు, సాగు, తాగునీటి సమస్యలపై దశల వారీగా ఉద్యమించాలని నిర్ణయించారు. తొలి విడతగా జిల్లా ప్రజానీకం ఎదుర్కొంటున్న విద్యుత్‌ కోతలకు నిరసనగా వచ్చే వారంలో విద్యుత్‌ సబ్‌స్టేషన్లు ముట్టడించాలని నాయకులు ఒక అభిప్రాయానికి వచ్చారు. ఆదివారం గుంటూరులో తెదేపా జిల్లా కార్యాలయంలో జరిగిన ముఖ్య నేతల సమావేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నాయకులు చర్చించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన టిడిపి జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ సాగర్‌ డెల్లా ప్రాంతంలోని లక్షల ఎకరాలు బీడు భూమిగా మారే ప్రమాదం ఏర్పడిందన్నారు. మాజీ మంత్రి డాక్టర్‌ కోడెల శివప్రసాద్‌ మాట్లాడుతూ వైఎస్‌ హయాంలో వాన్‌పిక్‌ పేరుతో 25 వేల ఎకరాల సాగుభూమిని పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టారని అన్నారు. తక్షణమే వాటిని రైతులకు స్వాధీనం చేయాలని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు వెంకట సుబ్బయ్య, ఏసురత్నం, రాజా, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.