యూపీ, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఫేక్‌ ఓటర్‌ ఐడెంటిటీ కార్డుల జారీ.. పలువురి అరెస్ట్‌


ఉత్తరప్రదేశ్‌ ,ఆగస్ట్‌19(జనం సాక్షి): యూపీ, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఫేక్‌ ఓటర్‌ ఐడెంటిటీ కార్డుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది..ఎన్నికల కమిషన్‌ వెబ్‌ సైట్‌ ని హ్యాక్‌ చేసి కొంత సొమ్ముకు ఈ కార్డులను ‘అమ్ముతున్న’ పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్‌ లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ యవ్వారం బయటపడిరది. యూపీలోని సహరన్‌ పూర్‌ లో ఈ నెల 13 న విపుల్‌ సైని అనే 24 ఏళ్ళ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ లో బ్యాచిలర్‌ డిగ్రీ తీసుకున్న ఇతగాడు..మధ్యప్రదేశ్‌ కి చెందిన అర్మాన్‌ మాలిక్‌ అనే వ్యక్తి సూచనపై మూడు నెలల్లో 10 వేలకు పైగా బూటకపు ఓటర్‌ ఐడెంటిటీ కార్డులను తయారు చేశాడట.. ఎన్నికల కమిషన్‌ వెబ్‌ సైట్‌ ని హ్యాక్‌ చేసి ఈ నిర్వాకానికి పాల్పడ్డాడట.. ఒక్కో కార్డుకు ఇతనికి 100 రూపాయల నుంచి 200 రూపాయలవరకు ముట్టేదట.. ఇతని బ్యాంకు అకౌంట్‌ లో 60 లక్షల రూపాయలు క్రెడిట్‌ కాగా ఆ ఖాతాను పోలీసులు స్తంభింపజేశారు. సైనితో బాటు మరికొందరిని కూడా వారు అదుపులోకి తీసుకున్నారు. ఇలాగే జార్ఖండ్డ్లోని పాలమూ జిల్లాలో 30 ఏళ్ళ ముకేశ్‌ కుమార్‌ అనే వ్యక్తిని పోలీసులు ఈ నెల 17 న అరెస్టు చేశారు. రాంచీ లోని ఓ వ్యక్తి నుంచి తనకు లింకులు, పాస్‌ వర్డులు అందేవని ఇతడు చెప్పినట్టు తెలుస్తోంది. బీహార్‌, యూపీ రాష్ట్రాల్లో ఈ రాకెట్‌ నెట్‌ వర్క్‌ ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే తమ డేటా బేస్‌ సురక్షితంగా ఉందని ఎన్నికల కమీషన్‌ వర్గాలు తెలిపాయి. ఇలా ఉండగా ఫేక్‌ ఓటర్‌ ఐడెంటిటీ కార్డులను ఉపయోగించి ఓటు వేయజాలరని మాజీ చీఫ్‌ ఎలెక్షన్‌ కమిషనర్‌ ఎస్‌.వై ఖురేషీ చెప్పారు. అందువల్ల ప్రజలు గానీ, పార్టీలు లేదా ఈసీ నిశ్చింతగా ఉండవచ్చునన్నారు.